PM Modi on Pakistan:పాకిస్థాన్ పరిస్థితి చూశారుగా! కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
‘పాకిస్థాన్ దగ్గర ఆటం బాంబు ఉన్నది జాగ్రత్త’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani shankar ayyar) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పైవిధంగా స్పందించారు.
Ambala, May 18: కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏం చేయాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో గత పదేళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది కాబట్టే బాంబును అడుక్కునే చిప్పలో వేసి పాకిస్థాన్ చేతిలో పెట్టామని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్ దగ్గర ఆటం బాంబు ఉన్నది జాగ్రత్త’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani shankar ayyar) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పైవిధంగా స్పందించారు. తాను మణిశంకర్ మాట్లాడిన ఒక వీడియోను ఫోన్‌లో చూశానని, అందులో ఆయన ‘భారత్.. పాకిస్థాన్‌ను గౌరవించి తీరాలి. ఎందుకంటే పాకిస్థాన్ దగ్గర ఆటం బాంబు ఉంది’ అని వ్యాఖ్యానించారని మోదీ చెప్పారు. ఇండియా కూటమికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ప్రధాని గుర్తుచేశారు.
కానీ గత పదేళ్లుగా కేంద్రంలోని బలమైన ప్రభుత్వం పాకిస్థాన్‌ను కట్టడి చేసిందని, వారి దగ్గరున్న బాంబును అడుక్కునే పాత్రలో వేసి వాళ్ల చేతిలోనే పెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏదైనా చేయాలనుకుంటే ఒకటి వందసార్లు ఆలోచించాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రంలో సర్కారు బలంగా ఉంది కాబట్టే జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేసి అభివృద్ధికి బాటలు వేశామని అన్నారు.