PM Modi In Indonesia: ఇండోనేషియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం, ప్రవాస భారతీయులతో ముచ్చటించిన మోదీ, ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని

జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీ, మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

PM Modi In Indonesia (PIC@ ANI X)

Jakarta, SEP 07: ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఇండోనేషియా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీ, మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. మువ్వెన్నెల జెండాలు చేతపట్టుకొని మోదీకి బ్రహ్మరథం పట్టారు. (PM Modi gets rousing welcome) హర్ హర్ మోదీ హర్ ఘర్ మోదీ అంటూ నినదించారు. చిన్నారులు, మహిళలు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. (Indian diaspora in Indonesia) మోదీ పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. ప్రవాసభారతీయులతో ప్రధాని సెల్ఫీలు దిగారు. మహిళలు కూడా మోదీకి కరచాలనం చేశారు.

జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి ఇండోనేషియా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుస్టీ ఆయు బింటాంగ్ ధర్మావతి స్వాగతం పలికారు. ఇండోనేషియా సంప్రదాయ నృత్యంతో మహిళలు మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆసియాన్-భారత్ ,తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలతో భారతదేశ భాగస్వామ్యం, భవిష్యత్తు రూపురేఖలపై చర్చించారు.

 

‘‘జకార్తాలో అడుగు పెట్టాను, వివిధ దేశాల అధినేతలతో కలిసి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ప్రధానమంత్రి మోదీ జకార్తా చేరుకున్నారు. ముఖ్యమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఆసియా నాయకులతో పరస్పర చర్చ జరిగే అవకాశం ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్ లో పోస్ట్ చేసారు.

 

ప్రధాని మోదీ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు. తూర్పు ఆసియా సదస్సుకు హాజరవుతారు. సమావేశాలు ముగిసిన వెంటనే మోదీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారతదేశం జి20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఢిల్లీకి తిరిగి వస్తారు.