5G Spectrum: 5జీ సేవలపై కేంద్రం కీలక నిర్ణయం, 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించిన కేంద్ర కేబినెట్, జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు తెలిపిన మోదీ సర్కారు
5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించింది.
దేశంలో 5జీ టెలికం సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించింది. ‘‘ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్య అంశంగా ఉంది’’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
‘‘బ్రాడ్ బ్యాండ్, మరీ ముఖ్యంగా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ప్రజల రోజువారీ జీవితాల్లో భాగంగా మారిపోయింది. 2015 నుంచి 4జీ సేవలు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరించడం ఇందుకు దోహదపడింది. నేడు 80 కోట్ల మంది టెలికం సబ్ స్క్రయిబర్లు బ్రాడ్ బ్యాండ్ సేవలను పొందుతున్నారు. 2014లో బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రయిబర్లు 10 కోట్లుగానే ఉన్నారు’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. 5జీ సేవలు నూతన తరం వ్యాపారాల సృష్టికి తోడ్పడతాయని, సంస్థలకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు తెచ్చిపెడతాయని ప్రభుత్వం పేర్కొంది. జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు తెలిపింది.