Martyrs' Day 2021: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు ఘనమైన నివాళి! మహాత్మా గాంధీ 73వ వర్థంతి సందర్భంగా జాతిపితను స్మరించుకున్న రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ఇతర ప్రముఖులు
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళి అర్పించే రోజుగా పాటిస్తారు. ఈరోజున మోహన్‌దాస్....
New Delhi, January 30: భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 30న షాహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులందరికీ నివాళి అర్పించే రోజుగా పాటిస్తారు. ఈరోజున మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ లేదా మహాత్మా గాంధీ వర్థంతి కూడా. ఇదే రోజున మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే హత్య చేశాడు.
అహింసా, సత్యం, ధర్మం లాంటి ఆదర్శాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులలో మహాత్మా గాంధీ ముఖ్యుడు. 1948 జనవరి 30న న్యూ దిల్లీలోని బిర్లా హౌస్ కాంపౌండ్ వద్ద గాంధీపై కాల్పులు జరిపితే, ఆ వార్త తెలిసి దేశం మొత్తం కదిలిపోయింది.
కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశం వలసవాదం నుండి విముక్తి పొందిన కొద్ది నెలలకే, అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిని మరియు ఒక ఉన్నతమైన నాయకుడిని కోల్పోయింది. అందుకే ఆ మహాత్ముడి మరణాన్ని స్మరించుకునేలా మరియు స్వాతంత్య్ర సమరయోధులందరి ప్రాణ త్యాగాల గౌరవార్థం జనవరి 30న అమర వీరుల దినోత్సవం ఒక జాతీయ ఆచారంగా జరుపుకోవడం ప్రారంభమైంది. దేశ రక్షణలో ఉండి, ఆ ప్రయత్నంలో మరణించిన భారత సైనికులకు, సాయుధ దళాల సిబ్బంది కూడా ఈరోజున గౌరవ వందనం సమర్పించడం అనవాయితీ.
PM Modi Pays Tribute to Gandhi ji:
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
మహత్మా గాంధీ వర్థంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, జాతిపితకు నివాళులు అర్పించారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన వంటి ఆయుధాలతో ప్రపంచానికి కొత్త తరహా విప్లవాత్మక ఉద్యమ మార్గాన్ని మహాత్ముడు చూపించడానికి మహాత్మా గాంధీ ఒక రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అహింసా, సత్యాగ్రహ దీక్షల ద్వారా స్వాతంత్య్ర సంగ్రామానికి ఉరకలెత్తించి, దేశ స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గాంధీజీ ఎన్నటికీ చిరస్మరణీయుడు, ఆయన వర్థంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. అంతిమ విజయం ఎప్పుడూ సత్యమేనని మహాత్మా గాంధీ జీవితం గుర్తు చేస్తుందని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
ఈ ఏడాది, కేంద్ర మరియు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ విభాగాలు ఈరోజున రెండు నిమిషాల మౌనం పాటించాలని ఆదేశాలు జారీచేయబడ్డాయి.