PM Narendra Modi Security Breach: ప్రధాని మోదీ భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ, ట్రావెల్ రికార్డును సేకరించాలని పంజాబ్‌-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు

పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ కోర్టులో వాదించారు.

Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, January 7: పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యం (PM Narendra Modi Security Breach) ఏర్పడిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ కోర్టులో వాదించారు. ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం కేవలం శాంతి భద్రతల సమస్య కాదని, అది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ చట్టం కిందకు వస్తుందని ఆయన వాదనలు వినిపించారు. ఎస్పీజీ చట్టం ప్రకారం ఇది రాష్ట్ర పరిధిలో అంశం కాదని మణిందర్ కోర్టుకు తెలిపారు.

ప్రధాని భద్రతా అంశం జాతీయ భద్రతకు సంబంధించినదని, ఇది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, ఈ అంశాన్ని ప్రొఫెషనల్‌గా దర్యాప్తు చేపట్టాలని అడ్వకేట్ మణిందర్ కోర్టుకు చెప్పారు. అయితే ప్రధానికి భద్రత కల్పించకపోవడం అత్యంత అరుదైన అంశమని, ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చిందని, ప్రధాని భద్రతకు పెను ముప్పు ఉన్నట్లు తేలిందని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. పంజాబ్ హోం మంత్రిని కూడా ఈ అంశంలో విచారించాలని, దర్యాప్తు ప్యానెల్‌లో ఆయన సభ్యుడిగా ఉండలేరని కోర్టుకు కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ప్రధాని భద్రతా వైఫలం అంశాన్ని లైట్‌గా తీసుకోవడం లేదని, దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, కేంద్రం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, విచారణ కోసం ఎవరినైనా నియమించవచ్చు అని కోర్టులో (Supreme Court) పంజాబ్ ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

డాక్టర్లకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు, నీట్- పీజీ అడ్మిషన్లకు ఒకే చెప్పిన అత్యున్నత ధర్మాసనం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు కోర్టు అంగీకారం

ఈ సందర్భంగా ప్రధాని కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుంటే, ఆ రాష్ట్ర డీజీపీని సంప్రదిస్తారని, రోడ్డు క్లియర్‌గా ఉన్నట్లు డీజీపీ చెబితేనే, ఆ తర్వాత కాన్వాయ్ కదులుతుందని తుషార్ కోర్టుకు చెప్పారు. అయితే రోడ్డు పై ఆందోళనకారులు అడ్డుకుంటారన్న హెచ్చరికలను అక్కడి ఇంచార్జ్ డీజీ చేయలేదని ఆయన కోర్టుకు విన్నవించారు. పీఎం కాన్వాయ్‌కు ముందు వార్నింగ్ కారు వెళ్తుందని, ఆ సమయంలో స్థానిక పోలీసులు ఆందోళనకారులతో టీ తాగుతున్నారని, అయితే వాళ్లు ధర్నా గురించి ఎటువంటి హెచ్చరికలు చేయలేదన్నారు.

ఈ వాదనలు విన్న ధర్మాసనం.. ప్రధాని పంజాబ్ పర్యటనకు చెందిన ట్రావెల్ రికార్డును సేకరించాలని పంజాబ్‌-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీం (Supreme Court Directs) ఆదేశించింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్ పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. రిజిస్ట్రార్ జనరల్‌తో సమన్వయం కోసం చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి ఒకరు నోడల్ ఆఫీసర్లుగా పని చేయాలని తెలిపింది.

కమిటీ అయినా లేక కమిషన్ అయినా.. ప్రధానికి జరిగిన భద్రతా వైఫల్యం ఏంటో నిర్ధారణ జరగాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పీఎం ట్రావెల్‌ రికార్డులను భద్రపరచాలన్నారు. విచారణ కోసం పంజాబ్ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, మరి కేంద్రం ఏర్పాటు చేసే కమిషన్ మాట ఏంటని ఆయన ప్రశ్నించారు. కమిటీ అయినా కమీషన్ అయినా.. సమస్యను తేల్చాలని సీజే అన్నారు. ఎస్పీజీ ఐజీ నేతృత్వంలోని కమిటీ కేవలం అడ్మినిస్ట్రేటివ్ అంశాలను మాత్రమే దర్యాప్తు చేస్తుందని ఎస్‌జీ మెహతా తెలిపారు. ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ఏర్పాటు చేసే కమిటీలో ఎన్ఐఏ అధికారితో పాటు చండీఘడ్ డీజీపీ ఉండవచ్చు అని సీజే రమణ తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్‌లో పర్యటించారు. కొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు. అయితే హెలికాప్టర్‌లో ప్రయాణించేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకున్నారు. జాతీయ స్మారక కేంద్రంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తుండగా, ఆ మార్గంలోని రోడ్డును కొందరు నిరసనకారులు దిగ్బంధించడంతో ఫిరోజ్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద ఆయన వాహన శ్రేణి నిలిచిపోవలసి వచ్చింది. దాదాపు 20 నిమిషాలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని, తిరిగి భటిండా విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సంఘటనపై లాయర్స్ వాయిస్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో) సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయ స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది.