PM Narendra Modi Security Lapse: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపం, న్యాయ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో పిల్, పిల్ కాపీని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదికి అందజేయాలని పిటిషనర్‌కు ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీవ్రమైన, ఉద్దేశపూర్వక భద్రతా లోపానికి (PM Narendra Modi Security Lapse) పాల్పడిన దానిపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు (Supreme Court to Hear PIL ) సుప్రీంకోర్టు అంగీకరించింది.
New Delhi, January 6: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీవ్రమైన, ఉద్దేశపూర్వక భద్రతా లోపానికి (PM Narendra Modi Security Lapse) పాల్పడిన దానిపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు (Supreme Court to Hear PIL ) సుప్రీంకోర్టు అంగీకరించింది. పీఎం పర్యటనలో భద్రతా లోపంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టులోని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదికి ఈ పిల్ కాపీని అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని తెలిపింది.
సీనియర్ అడ్వకేట్ మణిందర్ సింగ్ ఈ పిల్‌ను జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ‘‘పంజాబ్‌లో నిన్న ప్రధాన మంత్రి భద్రత తీవ్ర ఉల్లంఘనకు గురైన సంఘటనకు సంబంధించిన అత్యవసర విషయాన్ని ప్రస్తావిస్తున్నాను’’ అని మణిందర్ తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కొహ్లీ ఉన్నారు.
జస్టిస్ రమణ మాట్లాడుతూ, ‘‘మేం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు?’’ అని అడిగారు.
దీనిపై మణిందర్ సింగ్ స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌లో (Security Lapses During PM Modi's Punjab Visit) బుధవారం పర్యటించారని చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా లోపం జరిగిందని, ఇటువంటి దానిని మరోసారి జరగకుండా చూడాలని చెప్పారు. జరిగిన తప్పిదానికి బాధ్యులను గుర్తించాలన్నారు. భద్రతా ఏర్పాట్లపై వృత్తి నైపుణ్యంతో సమగ్ర దర్యాప్తు అవసరమని చెప్పారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో భటిండా జిల్లా జడ్జి ఈ పర్యటనకు సంబంధించిన పోలీసు బందోబస్తును పూర్తిగా పరిశీలించాలని కోరారు. ఈ పర్యటనకు పంజాబ్ పోలీసుల మోహరింపు, కదలికలకు సంబంధించిన అన్ని రికార్డులను భటిండా జిల్లా జడ్జి స్వాధీనం చేసుకుని, సుప్రీంకోర్టుకు సమర్పించాలన్నారు. ఆ రికార్డులను జిల్లా జడ్జి సుప్రీంకోర్టుకు సమర్పించిన తర్వాత, ఎటువంటి చర్యలు తీసుకోవాలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించాలని కోరారు.
ఈ రోజే (గురువారమే) దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేయడంపై పరిశీలించాలని కోరారు. సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఈ పిటిషన్ నకలును పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని, తదుపరి విచారణ శుక్రవారం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఈ పిల్‌లో పార్టీలుగా పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. పంజాబ్‌లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై వివరించేందుకు ఆయన సమావేశమైనట్లు జాతీయ మీడియా చెప్తోంది. ప్రస్తుతం వీరిద్దరి సమావేశం కొనసాగుతోంది. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్) అండ్ జస్టిస్ అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.