Virat Kohli on Hit List: ప్రధాని నరేంద్ర మోదీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హోం మంత్రి అమిత్ షాలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ, టీమిండియాకు సెక్యూరిటీ పెంపు

నవంబర్ 03న దిల్లీలో తొలి టీ-20 మ్యాచ్, నవంబర్ 07న రాజ్ కోట్ లో రెండో టీ-20 మరియు నవంబర్ 10న నాగ్ పూర్ లో మూడో టీ-20 మ్యాచ్ లు జరగనున్నాయి...

PM Narendra Modi, Virat Kohli, Amit Shah (Photo Credits: Getty Images/PTI)

New Delhi, October 30:  ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని చంపేస్తామంటూ ఆల్ ఇండియా లష్కరే తోయిబా పేరుతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు బెదిరింపు లేఖ వచ్చింది. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లను హిట్ లిస్టులో చేర్చామని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు చాలా వచ్చాయి. నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. అయితే తొలిసారిగా హిట్ లిస్టులో ఒక క్రీడాకారుడి పేరు రావడం, అలాగే ఈ ఆదివారం దిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ (ఫిరోజ్ షా కోట్ల) మైదానంలో భారత్ - బంగ్లాదేశ్ మధ్య టీ-20 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన NIA ఆ లేఖను దిల్లీ పోలీసులకు మరియు బీసీసీఐకి పంపించింది.

ఈ లేఖపై స్పందించిన దీల్లీ పోలీసులు టీమిండియా సభ్యుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. తమ భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ తాము నకిలీదిగా భావిస్తున్నామని అయినప్పటికీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత క్రికెట్ జట్టుకు మరియు వారు ఆడపోయే వేదికల వద్ద భద్రతను మరింతగా కట్టుదిట్టం చేస్తామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ బెదిరింపు లేఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బిజెపి సీనియర్ నేత అద్వానీ, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బిజెపి సీనియర్ నాయకుడు రామ్ మాధవ్‌ల పేర్లను 'హిట్ లిస్ట్' చేర్చినట్లు ఉంది.

కేరళలోని కోజికోడ్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గ్రూప్ విరాట్ కోహ్లీ మరియు ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుందని ఆ లేఖ పేర్కొంది. కాగా, ఆ హిట్ లిస్టులో చేర్చబడిన రాజకీయ నాయకులందరూ హై సెక్యూరిటీలోనే ఉంటారు, కాబట్టి వారి భద్రతకు ఎలాంటి ముప్పులేదు, ఇటు భారత జట్టుకు కూడా ఎలాంటి ముప్పు లేనప్పటికీ టీమిండియా వెళ్లే ప్రతిచోటులో వారికి భద్రత మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

భారత్ - బంగ్లాదేశ్ మధ్య 3 టీ-20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 03న దిల్లీలో తొలి టీ-20 మ్యాచ్, నవంబర్ 07న రాజ్‌కోట్‌లో రెండో టీ-20 మరియు నవంబర్ 10న నాగ్‌పూర్‌లో మూడో టీ-20 మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 14 నుం 19వరకు తొలి టెస్ట్ మ్యాచ్ ఇండోర్‌లో, నవంబర్ 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ముగియగానే,  వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తలపడనుంది.