Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో, తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు మంత్రి వర్గం ఆమోదం, గ్యాస్ సిలిండర్ రాయితీ పెంపు
ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది
New Delhi, Oct 4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.కేబినెట్ అంశాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్(Gas Cylinder)పై ఇచ్చే రాయితీని రూ.300లకు పెంచింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటివల తగ్గించిన రూ.200 తో కలిపి మొత్తం ఇప్పుడు రూ. 300 మేర ఉపశమనం కల్పించినట్టయ్యింది.ప్రస్తుతం 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూ.903 ఉండగా.. ఉజ్వల లబ్దిదారులు రూ.703 చొప్పున చెల్లిస్తున్నారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ లబ్దిదారులంతా సిలిండర్‌కు రూ.603 చొప్పున చెల్లిస్తే చాలు.
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం
గత తొమ్మిదేళ్లుగా మహిళలు, పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిందని, గత నెలలో రక్షాబంధన్ సందర్భంగా వంట గ్యాసు ధరను రూ.200 తగ్గించడంతో అది రూ.900కు చేరుకుందని, అయితే ఉజ్వల లబ్ధిదారులకు అది రూ.700కే లభిస్తుందని మంత్రి చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉజ్వల లబ్ధిదారులకు అదనంగా సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం- 2009లో సవరణకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు ద్వారా పసుపుపై అవగాహనతో పాటు వినియోగం, ఎగుమతులను పెంచడం, అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నూతన ఉత్పత్తుల్లో పరిశోధనాభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సంప్రదాయ పరిజ్ఞానాన్ని జోడించి పసుపు ఆధారిత ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు ఉపయోగపడనుంది. భారత్ నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి 1 బిలియన్ అమెరికా డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
గుడ్ న్యూస్, ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ రూ.200 నుండి రూ.300కి పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని రెండో కృష్ణా ట్రైబ్యునల్‌కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల 50లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.