PM Modi Jammu and Kashmir Tour: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్ కు ప్రధాని మోదీ, లోక్ సభ ఎన్నికల ముందు భారీ ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోదీ, శ్రీనగర్ లో వరుస కార్యక్రమాలు
ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Srinagar, March 07: జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మొదటిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు మోదీ కశ్మీర్ పర్యటనకు (Modi To Visit Srinagar) వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాని మోదీ నేడు కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. ఇక, కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.
అలాగే.. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు, మోదీ వస్తున్న క్రమంలో కశ్మీర్‌లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.