Farmer's Protest: కొనసాగుతున్న రైతుల ఉద్యమం, 1300కు పైగా జియో సిగ్నల్ టవర్లను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, రైతు సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించిన అన్నా హజారే
కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు రిలయన్స్ కంపెనీపై యుద్ధానికి దిగారు. రిలయన్స్ జియోకు చెందిన దాదాపు 1300కు పైగా సిగ్నల్ టవర్ల సైట్లను ధ్వంసం (Protesting farmers damage Jio towers) చేశారు.
Chandigarh- New Delhi, Dec 28: కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతులు రిలయన్స్ కంపెనీపై యుద్ధానికి దిగారు. రిలయన్స్ జియోకు చెందిన దాదాపు 1300కు పైగా సిగ్నల్ టవర్ల సైట్లను ధ్వంసం (Protesting farmers damage Jio towers) చేశారు. గడచిన 24 గంటల వ్యవధిలోనే 151 టవర్లను, అవి ఉన్న సైట్లను ‘ఆందోళనకారులు’ నాశనం చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు ఆస్తులను, కార్పొరేట్లను టార్గెట్ చేయవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Punjab Chief Minister Amarinder Singh) పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోతోంది.
ఎక్కడికక్కడ టెలికాం లైన్లను, ఇతర మౌలిక సదుపాయాలను వీరు ధ్వంసం చేస్తున్నారు. వీరంతా రైతులేనని చెప్పలేమని, కొందరు అరాచకవాదులు కూడా వీటికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. అయితే అలాంటి విద్రోహశక్తులను అన్నదాతలు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను కత్తిరించేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కొత్త చట్టాల విషయంలో ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ గ్రూపులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాలు వారి కంపెనీలకు భారీ లబ్ధి చేకూరుతుందని కొందరు వ్యక్తులు ఈ విధ్వంసానికి పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ శివార్లలో, పంజాబ్‌లోని చాలా చోట్ల నిరసనల్లో సంయమనం పాటించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. మీ చర్యల వల్ల ఫోన్ కనెక్టివిటీ పోతోంది.. ఫలితంగా ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలుగుతోంది. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఇలాంటివి అవాంఛనీయమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
ఒక్క రోజులో 200 పైచిలుకు చోట్ల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం వల్ల కనెక్టివిటీ తెగిపోయిందని, ఈ సైట్లలో సుమారు రూ.40కోట్ల దాకా నష్టం వాటిల్లిందని రిలయన్స్ జియో పేర్కొంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో రైతుల పేరిట కొందరు వ్యక్తులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, తగిన భద్రతనివ్వాలని 23వ తేదీనే పంజాబ్ డీజీపీకి లేఖ రాయడంతో ఆయన పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనపై రైతు సంఘం -భారతీయ కిసాన్ యూనియన్(ఉగ్రహాన్) స్పందించింది. రైతుల ముసుగులో అరాచకవాదులు దీన్ని చేస్తున్నారని ‘జియోను బహిష్కరించాలని, ఆ సిమ్‌లు వాడవద్దని మాత్రమే పిలుపునిచ్చాం తప్ప నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయమని కోరలేదని, రైతులూ అలా చేయరని పేర్కొంది.
రైతు సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతా : అన్నా హజారే
నూతన సంవత్సరం జనవరి నాటికి రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. అదే చివరి నిరసన అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. గత మూడేళ్లుగా రైతులు నిరసన (Farmer's Protest) చేస్తూనే ఉన్నారని, అయినా ప్రభుత్వం వాటిని పరిష్కరించలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం ఖాళీ వాగ్దానాలను ఇస్తోంది. అందువల్ల నాకు వాటిపై నమ్మకం లేదు. నా డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం నెల వ్యవధి అడిగింది. అందుకే నేను జనవరి వరకూ సమయం ఇచ్చా. డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే నేను నిరాహార దీక్షకు దిగుతా. అదే నా చివరి నిరసన దీక్ష అవుతుంది.’’ అని అన్నా హజారే హెచ్చరించారు.
బీజేపీ నేత అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యలపై మండిపడిన పంజాబ్ సీఎం
ఇదిలా ఉంటే అన్నదాతల్లో ‘అర్బన్ నక్సల్స్’ ఉన్నారని అధికార బీజేపీ నేత చేసిన వ్యాఖ్యపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మండిపడ్డారు. బీజేపీ నేత వ్యాఖ్య ‘ఫూలిష్’ నెస్‌కు నిదర్శనమని ఆదివారం ట్వీట్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు అవివేకమైన, చిల్లర రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని అమరీందర్ సింగ్ గుర్తు చేశారు. ముందుగా బీజేపీ నేతలు దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణపై కేంద్రీకరించాలని అమరీందర్ సింగ్ హితవు చెప్పారు.
అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ గత 24 గంటల్లో పంజాబ్‌లో టెలికం సర్వీసులు దెబ్బ తిన్నాయని, పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. పంజాబ్ పొలాల్లో నక్సల్స్ ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న నక్సల్స్ చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపణలకు దిగారు.
కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలి : ఢిల్లీ సీఎం
కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దు సింఘులోని గురు తేజ్ బహదూర్ మెమోరియల్‌ను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తున్న రైతు సంఘాల నేతలను కలిశారు. మన రైతులు గత 32 రోజులుగా చలి మధ్య వీధుల్లో ఎందుకు పడుకోవలసి వస్తున్నదని ప్రశ్నించారు.
ఇక్కడ 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తనకు చాలా బాధను కలిగించిందని చెప్పారు. రైతులు చెప్పేది విని వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నాలు చేయడానికి సీఎం కేజ్రీవాల్ 24 గంటలు కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ స్టేడియంలను జైళ్లుగా మార్చలేదన్నారు. తాము అలా చేసి ఉంటే చరిత్రలో ఒక నల్లని మచ్చగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు.
ప్రధాని ‘మన్ కీ బాత్' కార్యక్రమం సందర్భంగా రైతులు వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమం రేడియోలో కొనసాగుతున్నంత సేపు పళ్లాలు మోగించారు. ‘మోదీ మన్ కీ బాత్ వినీవినీ అలసిపోయాం. ప్రధాని రైతుల మన్ కీ బాత్ విననప్పుడు ఆయన మన్ కీ బాత్‌ను మేము ఎందుకు వినాలి?. అందుకే ఈ పళ్లాల చప్పుడు. ఈ శబ్దానికి మోదీ ఎంత చెప్పినా మాకు వినపడదని రైతులు తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)