New Delhi, December 27: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్న రైతులు.. ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు రైతు సంఘాలు వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు (Agriculture Secretary Vivek Agarwal) లేఖ పంపాయి. చట్టాల రద్దు (Repeal of laws), ఎమ్మెస్పీకి (MSP) చట్టబద్ధత ఈ చర్చల్లో ఉండి తీరాలని ఈ లేఖలో షరతు విధించారు. శనివారంనాడు సింఘూ సరిహద్దు పాయింట్ వద్ద సమావేశమైన 40 యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వం రెండ్రోజుల కిందట రాసిన లేఖపైనా, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఇచ్చిన పిలుపుపైనా చర్చించారు.
అసలు మీ అభ్యంతరాలేంటో, ఏఏ అంశాలను వ్యతిరేకిస్తున్నారో తెలియజేయండంటూ వివేక్ అగర్వాల్ రాయడంపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటిదాకా ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రతీ సారీ మంత్రులకు, అధికారులకూ చెబుతున్నాం... ఆ చట్టాల రద్దే మా ప్రధాన డిమాండ్ అని! కానీ దురదృష్టవశాత్తూ మీ లేఖ గత సమావేశాల్లో జరిగిన విషయాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
మా వైఖరిని వక్రీకరించి మేమేదో సవరణలు కోరుతున్నట్లు మీ లేఖ వివరిస్తోంది. ఇలాంటి దుష్ప్రచారాలు ఆపండి. రైతులపై ప్రతికూల ప్రచారాలు వద్దు. నిజంగా మా అభిప్రాయాలను గౌరవప్రదంగా మీరు వినదలిస్తే రైతుల ఉద్యమాన్ని (Farmers' Protest), అన్నదాతలపై బురద జల్లడాన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం ఆపాలని 40 యూనియన్ల ఐక్య వేదిక- సంయుక్త కిసాన్ మోర్చా ఆ లేఖలో సూటిగా స్పష్టం చేసింది.
డిసెంబర్ 29న జరపబోయే చర్చల ఎజెండాలో మూడు అంశాలు ఉండాలని మోర్చా తేల్చిచెప్పింది.
1. మూడు సాగు చట్టాల రద్దు కోసం చేపట్టాల్సిన విధివిధానాలు జాతీయ రైతు కమిషన్ సిఫారసు చేసిన ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన గ్యారంటీ కలుగజేసే విధివిధానం ఖరారు.
2. ఢిల్లీ, దానికి ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో వాయు కాలుష్య నిరోధానికి సంబంధించిన ఆర్టినెన్స్‌లో శిక్షార్హమైన నిబంధనల పరిధి నుంచి రైతులను మినహాయించేలా సవరణలు.
3. విద్యుత్తు సవరణల బిల్లు- 2020లో రైతుల ప్రయోజనాలు కాపాడేట్లు మార్పులు తేవడం. వీటిలో మొదటి రెండింటినీ కేంద్రం ఇప్పటికే అనేకసార్లు తిరస్కరిస్తూ వచ్చింది. ఎంఎస్పీకి చట్టబద్ధత చేకూర్చడం అసాధ్యమని, అది పాలనాసంబంధమైన అంశమని, ఇక చట్టాల రద్దు అసాధ్యమని మోదీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సవరణలకు మాత్రమే సంసిద్ధత చూపింది.
గడచిన నెల రోజులుగా ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళన చేస్తున్న వేల మంది రైతులకు తోడుగా పంజాబ్, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో అన్నదాతలు తాజాగా వచ్చి చేరారు. వీరే కాక పంజాబ్‌లోని తరన్ తారన్, భటిండా, అమృత్‌సర్, గురుదా్‌సపూర్‌ల నుంచి అనేకమంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఆహార దినుసులు, ఇతర నిత్యావసరాలు, టెంట్లు వేసుకుని ఢిల్లీ దిశగా బయలుదేరారు. మహారాష్ట్రలోని నాసిక్, నాగ్‌పూర్ సహా 21 జిల్లాల నుంచి వందలాది మంది రైతులు ఆలిండియా కిసాన్ సభ నేతృత్వంలో ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రభుత్వం చేసిన సాగు చట్టాల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అర్థమైనట్లు లేదని, తన నివాసానికి వస్తే వాటి గురించి విడమర్చి చెబుతానని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఎవరినీ తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టనివ్వరని, తాను మాత్రం ఆయనను రమ్మని ఆహ్వానిస్తున్నానని తివారీ చెప్పారు. చట్టాలు రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో తివారీ ఈ ప్రతిపాదన చేశారు.
సింఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేస్తున్న యువ రైతులు తమ నినాదాలు, డిమాండ్లతో కూడిన గాలిపటాలను తయారుచేసి వాటిని ఎగరేశారు. ‘రైతు లేనిదే ఆహారం లేదు... రైతు లేనిదే బతుకే లేదు, మేం రైతులం... ఉగ్రవాదులం కాదు... అని నినాదాలు రాసిన గాలిపటాలు ఎగరేశారు. కొందరు ఫేస్‌బుక్, ట్విటర్‌లలో ఈ ఆందోళన సాగుతున్న క్రమం, ఓ మేళా మాదిరిగా జరుగుతున్న తీరును వివరిస్తూ వివిధ కార్యక్రమాలను లైవ్‌స్ట్రీమ్ చేస్తున్నారు.