Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం 2014 ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి..

లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది.

Rahul Gandhi (photo-PTI)

New Delhi, june 25: అధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పోరాడేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు.పార్లమెంట్ లో ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. 18వ లోక్ సభ తొలి సమావేశాల్లో స్పీకర్ ఎన్నికకు కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ విపక్ష నేతగా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం గమనార్హం.

తొలి నుంచి ప్రభుత్వంపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతగా రాహుల్ గాంధీ.. విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం 2014 ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో విపక్ష నేత హోదా పొందాలంటే కనీసం కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది.

కానీ 2014, 2019 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండటంతో లోక్ సభలో విపక్ష నేత హోదాకు కాంగ్రెస్ పార్టీ దూరమైంది.లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీకి క్యాబినెట్ మంత్రి ర్యాంక్ లభిస్తుంది. అలాగే పార్లమెంట్ లో ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం లభిస్తుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక వంటి కమిటీల్లో ప్రధాని నరేంద్రమోదీతోపాటు రాహుల్ గాంధీకి చోటు లభిస్తుంది.