Kota Suicides: కోటాలో ఆగని ఆత్మహత్యలు, తాజాగా ఒత్తిడి తట్టుకోలేక మరో విద్యార్థి ఆత్మహత్య, ఈ ఏడాది మొత్తం 28కి చేరిన బలవనర్మణాల సంఖ్య
ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
kota, Nov 28: రాజస్థాన్‌లో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో మరో విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది.
తాజా ఆత్మహత్య ఘటన వివరాల్లోకెళితే.. పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫరీద్ హుస్సేన్ కోటాకు వచ్చి నీట్ పరిక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వక్ఫ్ నగర్ ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గదిలో ఒంటరిగా ఉన్న హుస్సేన్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.బయటకు వెళ్లిన స్నేహితులు రాత్రి 7 గంటలకు గది వద్దకు వచ్చేసరికి బయట నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కాల్ చేయగా ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. తలుపులు పగలగొట్టి చూడగా.. హుస్సేన్ విగత జీవిగా కనిపించాడు.
కోటాలో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.గత సంవత్సరాలతో పోలిస్తే 2023లోనే అత్యధికంగా ఆత్మహత్య కేసులు(28) నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇక విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో , భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.