Kota, Nov 21: రాజస్థాన్‌లోని కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా తల్లిదండ్రుల ఆశలు, అంచనాలే విద్యార్థులను బలవన్మరణానికి (Kota suicides) పురిగొల్పుతున్నాయని తేల్చి చెప్పింది.వారి ఆత్మహత్యలపై కోచింగ్ సెంటర్లను (coaching centres) తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది.
మెడికల్, ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులకు విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రైవేటు సెంటర్ల తీరుతో విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ముంబైకి చెందిన ఓ వైద్యుడు సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు దేశంలో చట్టం ఏదీ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోచింగ్ సెంటర్లు విద్యార్థులను లాభాలు తెచ్చే వస్తువులుగా చూస్తున్నాయని పేర్కొన్నారు.
కోటాలో మళ్లీ ఇంకో విద్యార్థి ఆత్మహత్య, తాజా మరణంతో ఈ ఏడాది 26కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య
అయితే, పిటిషన్‌లో ఎక్కువగా రాజస్థాన్‌లోని ఘటనలనే పేర్కొన్నందుకు పిటిషనర్ ముందుగా అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యకు కోచింగ్ సెంటర్లను బాధ్యులను చేయకూడదని అభిప్రాయపడింది. ‘‘మనలో చాలా మంది కోచింగ్ సెంటర్లు వద్దనే అనుకుంటున్నారు. కానీ, ఈ చదువుల్లో పోటీ పెరిగిపోయింది.
ఒక మార్కు, అర మార్కు తేడాతో విద్యార్థులు సీటు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై చాలా ఆశలు, అంచనాలు ఉంటున్నాయి’’ అని న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై చట్టం తేవాలని తాము సూచించలేమని తేల్చి చెప్పింది. రాజస్థాన్ హైకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.