Social Sciences Curriculum: ఇకపై స్కూల్ పుస్తకాల్లో రామాయణం, మహాభారతం ఉండాల్సిందే! రాజ్యాంగ పీఠికను స్కూల్ గోడలపై రాయాలంటూ సిఫారసు, ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలంటూ ప్రతిపాదన
సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో రామాయణం(Ramayana), మహాభారతం (Mahabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని కూడా సూచించింది.
New Delhi, NOV 22: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT Panel)కి చెందిన అత్యున్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో రామాయణం(Ramayana), మహాభారతం (Mahabharata) వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రతిపాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని కూడా సూచించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ గత ఏడాది ఏర్పాటైంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పన (Social Sciences Curriculum) కోసం ఈ కసరత్తు జరుగుతోంది. ‘‘ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో ఉన్న చరిత్రను ‘ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలు’గా విభజించారు. అయితే, మన చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని కమిటీ సిఫార్సు చేసింది.
క్లాసిక్ పీరియడ్ (సంప్రదాయ చరిత్ర), మధ్య యుగం, బ్రిటిష్ కాలం, ఆధునిక భారతం.. ఇలా నాలుగు భాగాలుగా వర్గీకరించి చరిత్రను బోధించాలి. క్లాసిక్ పీరియడ్‌లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, పురాణాలను చేర్చాలి. ఇతిహాసాల గురించి విద్యార్థులు తెలుసుకోగలగాలి. దీనివల్ల వారు ఆత్మగౌరవం, దేశభక్తిని పెంపొందించుకోవచ్చు’’ అని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ ఛైర్మన్ సి.ఐ.ఐజాక్ పేర్కొన్నారు. చరిత్ర పాఠ్యాంశాల్లో కమిటీ సిఫార్సులపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది.