Satish Kaushik Death: రూ. 15 కోట్ల కోసమే బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ హత్య జరిగిందా? తన భర్తే హత్య చేయించాడంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రూ. 15కోట్ల లావాదేవీల్లో భాగంగానే సతీష్ కౌశిక్ మరణం జరిగిందని ఓ మహిళ ఆరోపించారు.
New Delhi, March 11: బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు సతీష్ కౌశిక్ (Satish Kaushik) మరణంపై మరో అనుమానం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రూ. 15కోట్ల లావాదేవీల్లో భాగంగానే సతీష్ కౌశిక్ మరణం జరిగిందని ఓ మహిళ ఆరోపించారు. దుబాయ్ చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కు సతీష్ కౌశిక్ (Satish Kaushik Death) రూ. 15 కోట్లు ఇచ్చారని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ప్లాన్ చేసి చంపేశారంటూ (allegedly killed Kaushik) ఆరోపించారు. అయితే ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో కాదు. హంతకుడిగా చెప్తున్న వ్యక్తి భార్య అని తెలుస్తోంది. తన భర్తే ఈ హత్యకు ప్లాన్ వేశాడని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. సతీష్ కౌశిక్ ను చంపేందుకు తన భర్త కొన్ని ట్యాబ్లెట్స్ ను ఏర్పాటు చేశాడని కూడా తెలిపింది. ఇప్పటికే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్‌లో పోలీసులకు నిషేధ ఉత్పేరిత డ్రగ్స్ (Drugs) లభ్యమయ్యాయి.
హోలీ వేడుకలు చేసుకుంటూ సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది (Vikas Malu) కాగా.. అక్కడ లభ్యమైన అభ్యంతరకరమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారనేది మిస్టరీగా మారింది. తాజాగా ఓ మహిళ ఆరోపణలు సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలను బలపరుస్తున్నాయి.
అయితే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్ ఓనర్ వికాస్ మాలుపై గతంలో అత్యాచారం కేసు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైందనే దానిపై ఆరా తీస్తున్నారు. మృతి తర్వాత పరారీలో ఉన్న పారిశ్రామికవేత్తను కూడా పోలీసులు విచారించాలకుంటున్నారు. అయితే, సతీశ్ కౌశిక్ పోస్ట్‌మార్టంలో మాత్రం ఎటువంటి అనుమానం వ్యక్తం కాలేదు. ఆయన గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానే సతీశ్ కౌశిక్ శరీరంలో ఏముంది? అనేది తెలుస్తుంది. తదుపరి విచారణ కోసం ఆయన శరీర భాగాల నమూనా భద్రపరచినట్టు పోలీసులు తెలిపారు. గుండెపోటు గురైన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ ఈ విషయం గురించి పోలీసులకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. ఇది అనుమానాలకు దారి తీస్తోంది.
హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన సతీష్ కౌశిక్.. ‘మాసూమ్’ ద్వారా నటుడిగా బాలీవుడ్‌కు పరిచమయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు మాటల రచయితగా... దర్శకుడిగా పనిచేశారు. అనుపమ్ ఖేర్, ఆయన కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు. ‘మిస్టర్ ఇండియా’, ‘దీవానా మస్తానా’, ‘బ్రిక్ లేన్’, ‘రామ్ లఖన్’, ‘సాజన్ చలే ససురాల్’ తదితర చిత్రాల్లో నటించారు.