Satish Kaushik Passed Away (PIC @ Satish Kaushik FB )

Mumbai, March 09: బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ (Satish Kaushik) కన్నుమూశారు. 67 ఏండ్ల కౌశిక్‌ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస (Passed away) విడిచారని సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మరణం ఈ ప్రపంచంలో మరణం అనేది అంతిమమని నాకు తెలుసు. కానీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ సతీశ్‌ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏండ్ల తమ స్నేహం ఈరోజుతో ముగిసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సతీశ్‌ కౌశిక్‌ గతంలో కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సతీశ్‌ కౌశిక్‌ 1956, ఏప్రిల్‌ 13న హర్యానాలోని (Haryana) మహేంద్రగఢ్‌లో జన్మించారు. 1983లో వచ్చిన ‘మాసూమ్‌’ సినిమాతో చిత్రపరిశ్రమలో జర్నీ ప్రారంభించారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలకు పనిచేశారు. 1990లో రామ్‌ లఖన్‌, 1997లో సాజన్‌ చలే ససురాల్‌ సినిమాలకుగాను ఫిల్మ్‌ఫేర్‌ (ఉత్తమ హాస్యనటుడు) అవార్డు అందుకున్నారు.

తేరే నామ్‌, వాదా వంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 2007లో అనుపమ్‌ ఖేర్‌తో కలిసి కరోల్ బాగ్‌ ప్రొడక్షన్స్‌ అనే సినిమా కంపెనీని ప్రారంభించారు. కౌశిక్‌ మృతిపట్ల నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.