Odisha: ఒడిశాలో తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం, సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌‌లో పొగలు, బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు

సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ (Secunderabad-Agartala Express)లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Representational (Credits: Facebook)

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని 278 మంది మృతి చెందిన ఘోరం మరువక ముందే మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ (Secunderabad-Agartala Express)లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌ - అగర్తల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని బరంపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు బి-5 ఏసీ కోచ్‌ నుంచి పొగలు (Smoke) రావడం ప్రయాణికులు గుర్తించారు.

దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి దిగిపోయి రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. రైలును ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. తర్వాత కొద్దిసేపటికి పొగ అదుపులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులు ఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్ అనుకుని ఆ కోచ్ లో ప్రయాణం చేయమంటే చేయమని పట్టుబట్టారు.

ఒడిశా రైలు ప్రమాదం, 278కి చేరుకున్న మరణాల సంఖ్య, ఇంకా గుర్తించలేని స్థితిలో 101 మృతదేహాలు

ఏసీలో మంటలు వచ్చినట్లు గుర్తించిన సిబ్బంది వాటిని ఆర్పివేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. అయితే, ఈ పరిణామంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. కొందరు ప్రయాణికులు మళ్లీ బోగీ ఎక్కేందుకు నిరాకరించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కొంతసేపు స్టేషన్‌లో నిలిచిన రైలు.. 45 నిమిషాల తర్వాత తిరిగి గమ్యస్థానానికి బయల్దేరింది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... సికింద్రాబాద్ - అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా బి-5 బోగీలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో పెట్టె నిండా పొగలు వ్యాప్తి చెందాయి. ప్రయాణికులు అలారం సిగ్నల్ ఇవ్వడంతో రైలులో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యి పొగను నియంత్రించారన్నారు.