Sanatana Dharma Remarks: కొడుకు సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం స్టాలిన్, ఒక్క ముక్క కూడా తప్పులేదని, బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుతోందని విమర్శ
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతుండగా.. అటు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
Chennai, Sep 4: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతుండగా.. అటు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. సోషల్ మీడియాలో ఉదయనిధి గతంలో చర్చికి, ఆలయాలకు వెళ్లిన ఫొటోలతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ బీజేపీ నేతలు తమిళనాడు గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కు స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీని అందజేశారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా స్పందించారు. కొడుకు వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయనిధికి మద్దతుగా మాట్లాడారు. తన కొడుకు చేసిన వ్యాఖ్యల్లో ఒక్క ముక్క కూడా తప్పులేదని సమర్థించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎందుకు మాట్లాడరని నిలదీశారు.
ఎన్నికల హామీలను బీజేపీ అమలుచేయలేదని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మతాన్ని ఆయుధంగా వాడుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి, ఆ మంటల వెచ్చదనంలో చలికాచుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లు, మణిపూర్ హింసాత్మక ఆందోళనలు, హర్యానాలో గొడవలను ప్రస్తావిస్తూ.. బీజేపీని ఇప్పటికైనా నిలువరించకపోతే దేశాన్ని, దేశంలోని ప్రజలను ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
మరోవైపు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మంత్రి ఉదయనిధికి మద్దతు పలికారు. ఈ వివాదంపై ఓ ట్వీట్ చేశారు. అందులో.. సనాతన పార్లమెంట్ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ స్వామీజీలతో కలిసి ఉన్న మోదీ ఫొటోను షేర్ చేశారు.
సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం హేయమైన చర్య అని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయినిధిని సమర్ధిస్తూ కార్తి చిదంబరం చేసిన వ్యాఖ్యలనూ పురందేశ్వరి ఖండించారు.
‘భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధం. అదే వేదికపై ఉన్న తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం దేనికి సంకేతం? సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే ‘ఇండియా’ కూటమి ఉద్దేశమని కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు లేదన్నారు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. ఇది చాలా దారుణమని చెప్పారు.
ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..
తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ..సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమన్నారు. కరోనా వైరస్, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. దీనిని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. పూర్తిగా రూపుమాపాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని అసోసియేషన్ నిర్ణయించటాన్ని ఆయన సమర్థించారు.
సనాతన భావజాలంలో భాగంగానే కేంద్రం ‘నీట్’ను తీసుకొచ్చిందన్నారు. ‘సనాతనం అన్నది సంస్కృత పదం. సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకం తప్ప మరోటి కాదు. కులం పేరుతో మనుషుల్ని విడదీసింది’ అని ఆయన విమర్శించారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ నాయకుడు, దివంగత నేత కరుణానిధి ద్రవిడ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒక్కచోటకు తీసుకొచ్చారని వివరించారు.