Mumbai, SEP 02: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ (Maratha Reservation) కోసం చేపట్టిన ఆందోళనలు శనివారం కూడా హింసాత్మకంగా మారాయి. జాల్నా జిల్లాలో ఆందోళనకారులు చెలరేగిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకున్నది. జల్నా జిల్లా అంబాద్ పరిధిలోని అంతర్వాలి సరతి గ్రామంలో నిరసనలు మొదలయ్యాయి.
#WATCH | Maharashtra | Stone pelted, vehicle torched during protest demanding Maratha Reservation in Jalna. Police disperse the protesters. pic.twitter.com/W5vilmg9LX
— ANI (@ANI) September 2, 2023
మనోజ్ జరంగే నేతృత్వంలో మంగళవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరసన శుక్రవారం హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు లాఠీచార్జితోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
మరోవైపు మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని విపక్ష పార్టీలు ఖండించాయి. అయితే శాంతి పాటించాలని సీఎం ఏక్‌నాథ్ షిండే పిలుపునిచ్చారు. హింసపై ఉన్నతస్థాయి విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.