Rioting Must Stop Says SC: సుప్రీంకోర్టుకు చేరిన జామియా మరియు అలీగర్ విద్యార్థుల ఆందోళన, హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్ట్ సీరియస్, 'అల్లర్లు' ఆగితేనే విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించిన పిటిషన్లను విచారిస్తామన్న సీజేఐ

అందరి హక్కులను మేము పరిగణలోకి తీసుకుంటాము కానీ ఇలాంటి హింసాత్మకమైన వాతావరణంలో కాదు, ఈ అల్లర్లు తగ్గితే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటాము, హక్కుల కోసం జరిగే శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదు" అని సీజేఐ అన్నారు. .....

Supreme Court of India |(Photo Credits: IANS)

New Delhi, December 16:  దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (Jamia Millia Islamia University) మరియు ఉత్తర ప్రదేశ్‌లోని అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం (Aligarh Muslim University) లోని విద్యార్థులపై పోలీసు చర్యలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టుకు చేరింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వారిని కట్టడి చేసే క్రమంలో పోలీసులు వర్శిటీలోకి చొరబడి విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు. అయితే ఈ నిరసనలకు దూరంగా ఉన్న విద్యార్థులపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, ఆడపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా బాతు రూంలలోకి, లైబ్రరీలలోకి కూడా చొరబడి విచక్షణారహితంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని సుప్రీంను కోరగా, సుప్రీం ధర్మాసనం అందుకు నిరాకరించింది. ముందుగా వర్శిటీల్లో శాంతిని నెలకొల్పాలని సూచించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విద్యార్థులు ప్రజాఆస్తులను ధ్వంసం చేయడాన్ని సుప్రీం తప్పుపట్టింది. 'అల్లర్లు' ఆగితేనే ఈ పిటిషన్ పై డిసెంబర్ 17న విచారిస్తామని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ బొబ్డే (CJI SA Bobde) స్పష్టంచేశారు.

" అందరి హక్కులను మేము పరిగణలోకి తీసుకుంటాము కానీ ఇలాంటి హింసాత్మకమైన వాతావరణంలో కాదు, ఈ అల్లర్లు తగ్గితే సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటాము, హక్కుల కోసం జరిగే శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదు" అని సీజేఐ అన్నారు. విద్యార్థులు తమ ఆందోళనలను వర్శిటీ దాటి వీధుల్లోకి తీసుకొస్తే అది వారిష్టం కానీ, దాని తర్వాత జరిగే పరిణామాల కోసం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించకూడదని సీజేఐ పేర్కొన్నారు.

జామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన హింసాత్మక నిరసనలో, ఆందోళనకారులు ఆదివారం సాయంత్రం నాలుగు ప్రభుత్వ బస్సులను మరియు రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. ఈ ఘర్షణలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు అగ్నిమాపక అధికారులు గాయపడ్డారు.

ఈ ఘటన జరిగిన వెంటనే దిల్లీ పోలీసులు బలవంతంగా జామియా క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. వర్శిటీలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో 50 మంది అదుపులోకి తీసుకొని తిరిగి సోమవారం ఉదయం విడుదల చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now