TDS on Online Gaming: ఆన్‌లైన్ గేములు ఆడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి మీ జేబుకు చిల్లు ఖాయం, ఇకపై గేమ్‌లో గెలిస్తే టీడీఎస్ కట్టాల్సిందే
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌లో (online gaming) పాల్గొనే వారు పొందే గెలుచుకునే మొత్తాలపై 30 శాతం టీడీఎస్ (TDS) వసూలు చేస్తుంది. ప్రతి రూపాయి రాబడిపైనా టీడీఎస్ వసూలు చేస్తారు.
New Delhi, March 25: ఆన్‌లైన్ గేమ్స్‌లో (online gaming) పాల్గొనే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌లో (online gaming) పాల్గొనే వారు పొందే గెలుచుకునే మొత్తాలపై 30 శాతం టీడీఎస్ (TDS) వసూలు చేస్తుంది. ప్రతి రూపాయి రాబడిపైనా టీడీఎస్ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లించి రూ.35,500 ఆదాయం గడించారనుకుందాం. అందులో రూ.1000 మినహాయించి రూ.34,500పై టీడీఎస్ 30 శాతం కోత విధిస్తారు. అంటే రూ.10,350 కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ (Finance ministry) ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మిగతా రూ.24,150 మాత్రం సంబంధిత వ్యక్తి ఖాతాలో జమ చేస్తారు. ఆర్థిక బిల్లు-2023కు సవరణ ప్రకారం తొలుత ప్రతిపాదించినట్లు వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి కాగా, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఆన్‌లైన్ గేమింగ్‌పై టీడీఎస్ (TDS on online gaming ) డిడక్ట్ చేస్తారు.
శుక్రవారం లోక్‌సభ ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీల తర్వాత సవరణలు తీసుకొచ్చింది. ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో నిబంధనలు పాటించకపోతే టీడీఎస్ రెట్టింపు డిడక్ట్ చేయాలని ప్రతిపాదించారు. సంబంధిత ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఐటీ రిటర్న్స్, ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే మాత్రం టీడీఎస్ రెట్టింపు డిడక్ట్ చేస్తారు. గతేడాది రూ.50 వేలకు పైగా డిడక్ట్ చేసేవారు. యూజర్ల నుంచి ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు లాభాలు గడించేందుకు నిబంధనల్లో సవరణలు తెచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ నెలాఖరు వరకు ఆన్‌లైన్ గేమింగ్స్‌లో రూ.10 వేలకు పైగా లాభాలు గడిస్తేనే టీడీఎస్ వర్తించేది.