30 Days Scheme: 30 రోజుల్లో గ్రామాల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోవాలి! తెలంగాణలో 30 రోజుల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, సెప్టెంబర్ 06 నుంచి అమలు.
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్య సేవకుడిగా తాను భావిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు కూడా తాము ప్రజాసేవకులు అనుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు....
Hyderabad, September 04: గ్రామాల ముఖ చిత్రాలు పూర్తిగా మారేలా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR) 30 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టారు. గతనెల ఆగష్టు 15నే 60 రోజుల ప్రణాళికను సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశలో 30 రోజుల కార్యాచరణను సీఎం వివరించారు. ఈ దసరా పండుగను ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన ఈ 30 రోజుల బృహత్ కార్యాచరణను ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్య సేవకుడిగా తాను భావిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు కూడా తాము ప్రజాసేవకులు అనుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణకు కలెక్టర్లు నాయకత్వం వహించాలని, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నానని కేసీఆర్ అన్నారు.
సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమయి, నెల రోజుల పాటు అమలు జరిగే ప్రత్యేక కార్యాచరణ ఈ విధంగా ఉంది
• సెప్టెంబర్ 4న కలెక్టర్లు జిల్లా స్థాయి సదస్సు నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి
• ప్రతీ గ్రామానికి ఒక మండల స్థాయి అధికారి పర్యవేక్షకుడిగా నియమించాలి
• జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు
• ప్రజలను చైతన్య పరచడానికి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై నినాదాలు రాయాలి
• మొదటి రోజు గ్రామ సభ నిర్వహించాలి, సభలో ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించాలి, కార్యక్రమ ఉద్దేశ్యాలను గ్రామసభలో ప్రజలకు వివరించాలి
• రెండో రోజు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయాలి. స్టాండింగ్ కమిటీలను నియమించాలి
• సర్పంచుల కుటుంబ సభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా నియమించవద్దని నిబంధనను ప్రభుత్వం పెట్టింది. కాబట్టి కో ఆప్షన్ సభ్యులుగా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి. స్టాండింగ్ కమిటీలలో సగం మంది మహిళలుండాలి
• సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి, గ్రామ పంచాయతీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు గ్రామంలో పాదయాత్ర నిర్వహించాలి
• ఏఏ పనులు చేయాలో రాసుకోవాలి. దాని ప్రకారం గ్రామ ప్రణాళిక తయారు చేయాలి. గ్రామ ప్రణాళిక రూపకల్పనలో ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించాలి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతీ గ్రామ ప్రణాళిక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉండాలి
• 30 రోజుల్లో ఒక రోజు పూర్తిగా మహిళలకు కేటాయించాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యం కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు
స్వచ్ఛత మరియు పారిశుధ్యానికి సంబంధించిన విధులు:
• గ్రామ పంచాయతీల ప్రధాన భాధ్యత గ్రామంలో పారిశుధ్య నిర్వహణ .
• కూలిపోయిన ఇండ్లు, పాడుపడిన పశువుల కొట్టాల శిథిలాలు తొలగించాలి
• సర్కారు తుమ్మ, జిల్లేడు, వయ్యారిభామ లాంటి పిచ్చి చెట్లను తొలగించాలి
• పాడు పడిన బావులను, వాడకంలో లేని బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని నీటి గుంతలను పూడ్చివేయాలి
• ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి
• దోమల మందు పిచికారి చేయాలి
• డ్రైనేజీలను శుభ్రం చేయాలి. మురికి కాలువల్లో ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగించాలి
• రోడ్లపై గుంతలను పూడ్చాలి
• పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు గ్రామ పంచాయతీ చేయాలి
• అంగడి బజార్, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి
• ప్రతీ ఇంట్లో చెత్త బుట్ట ఉండేలా ప్రజలను ప్రోత్సహించాలి
• చెత్తను ఎత్తి, డంపింగ్ యార్డులో వేసి, ఆ చెత్తను కంపోస్టు ఎరువుగా వినియోగించేలా బాధ్యత తీసుకోవాలి
• అవకాశం ఉన్న చోట బందెలదొడ్డి ఏర్పాటు చేయాలి
• సఫాయి కర్మచారులకు జీతాలు పెంచినందున, వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి
• ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా.
• దహన వాటికలు - ఖనన వాటికలు (వైకుంఠ ధామం), డంపింగ్ యార్డులకు కావాల్సిన స్థలం ఎంపిక చేయాలి
• ప్రభుత్వ స్థలం లేకుంటే గ్రామ పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు చేయాలి. దాతల విరాళాలు స్వీకరించవచ్చు.
పచ్చదనం పెంచేందుకు గ్రీన్ ప్లాన్
* ప్రతీ ఇంటికి వేప మొక్కతో పాటు మొత్తం ఆరు మొక్కలు పంపిణీ చేయాలి
• వ్యవసాయ భూములు, వ్యవసాయ బావుల వద్ద పెంచడానికి అనువైన మొక్కలను రైతులకు అందివ్వాలి. మండల వ్యవసాయాధికారి సహకారంతో చింత, అల్లనేరేడు, ఇతర మొక్కలు పంపిణీ చేయాలి
• చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలి
• గ్రామ విస్తీర్ణానికి అనుగుణంగా, శాస్త్రీయంగా అంచనా వేసి అవసరమైన మొక్కలను సిద్ధం చేయడానికి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు నిర్వహించడానికి అనువైన స్థలం ఎంపిక చేయాలి
• నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి
• గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను మరియు పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి
• ఊరు బయట అడవులు, కంచెలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా పండ్ల మొక్కలు పెంచడం ద్వారా కోతుల బెడదను తీర్చవచ్చు
• గ్రామ గ్రీన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలి. అన్ని గ్రామల గ్రీన్ ప్లాన్ కు అనుగుణంగా జిల్లా గ్రీన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రీన్ ప్లాన్ తయారు చేయాలి
• గ్రామ పంచాయతీ మొక్కల రక్షణ ఏర్పాట్లు చేయాలి
• గ్రామ బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనం పెంచడానికి వినియోగించాలి
• ప్రతీ గ్రామ పంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవాలి
• చెత్త సేకరణకు, చెట్లకు నీళ్లు పోయడానికి ట్రాక్టర్ వినియోగించాలి
• నాటిన మొక్కల్లో 85 శాతం చెట్లనన్నా రక్షించకుంటే, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి
విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం పవర్ వీక్
• గ్రామంలో పవర్ వీక్ నిర్వహించాలి. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి సహకరిస్తారు
• వేలాడుతున్న మరియు వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి
• వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి
• ఎల్ఇడి లైట్లను అమర్చాలి
• వీధి దీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సపరేట్ మీటర్, స్విచ్చులు బిగించాలి
• పగలు వీధి లైట్లు వెలగకుండా చూడాలి. శీతాకాలంలో సాయంత్రం 6.00 నుండి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7.00 నుండి ఉదయం 5.30 వరకు వీధి లైట్లు వేయాలి
ఖర్చుల కోసం బడ్జెట్ ఇలా రూపొందించుకోవాలి.
• వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించాలి. వాటికి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి
• ఈ ప్రణాళికలకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించాలి
• అప్పుల చెల్లింపు, జీతాల చెల్లింపు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఖర్చులను తప్పనిసరిగా చేయాల్సిన వ్యయంలో చేర్చాలి
• ప్రతీ ఇంటికీ, ప్రతీ ఆస్తికి సరైన విలువ కట్టాలి. క్రమం తప్పకుండా ఆస్తుల విలువ మదింపు చేయాలి
• పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేయాలి. పన్నులు వందశాతం వసూలు చేయని గ్రామ కార్యదర్శిపై చర్యలుంటాయి
నిధుల సమీకరణ మార్గాలు
• రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు వస్తాయి
• ఫైనాన్స్ కమిషన్ నిధులు సమకూరుతాయి
• నరేగా నిధులు వస్తాయి
• గ్రామ పంచాయతి సాధారణ నిధులు అందుబాటులో ఉంటాయి
• ప్రజల శ్రమదానంతో పనులు నిర్వహించాలి
• సి.ఎస్.ఆర్. నిధులను సమకూర్చుకోవాలి
• దాతల నుంచి విరాళాలు సేకరించాలి
అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు, రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్క్వాడ్ లు
• సీనియర్ అధికారుల నేతృత్వంలో 100 ఫ్లయింగ్ స్వ్కాడ్ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
• 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత ఈ బృందాలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి
• లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందుతాయి
• అజాగ్రత్త, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలుంటాయి.
ఈ విధంగా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణకు సంబంధించి అన్ని అంశాలను, కార్యాచరణలో అధికారుల మరియు ప్రజల కర్తవ్యాలను సీఎం కేసీఆర్ విడివిడిగా విడమరిచి చెప్పారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)