Telangana: వీడియో ఇదిగో, మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు, త్వరలో పెట్టుకునేలా సుందరీకరణ చేస్తానని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Hyd, Oct 7: మీ ఇంట్లో ఆడ పిల్లలకు మూసీ అనే పేరు ఎందుకు పెట్టకూడదు.. కృష్ణా, గంగా, సరస్వతి, యమున గోదావరి నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టినట్లు మూసీ అనే పేరు కూడా అమ్మాయిలకు పెట్టేలా మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ పథకం ఆగదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మూసీ పరీవాహకం పరిధిలో ఉన్న పది వేల కుటుంబాలకు మురికి జీవితం కాకుండా మంచి జీవితం అందించటం కూడా ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ‘‘మన ఇళ్లలో ఆడబిడ్డలకు గోదావరి, సరస్వతి, నర్మద, కృష్ణా.. ఇలా నదుల పేర్లు పెట్టుకుంటాం. మరి మూసీ కూడా నది పేరే కదా. ఆ పేరు ఎందుకు పెట్టుకోవటం లేదు. మూసీ అనగానే మురికి కూపమన్న భావన రావడమే దీనికి కారణం.
అందుకే ఆ మురికిని ప్రక్షాళన చేసి.. నదిని అద్భుతంగా మార్చుతాం. పిల్లలకు మూసీ అన్న పేరు పెట్టుకునేలా చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో గతంలోనే నోటిఫికేషన్లు జారీ అయిన ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు.
కృష్ణా,గంగ,సరస్వతిలా మూసీ నది..అమ్మాయిలకు మూసీ అనే పేరు పెట్టేలా సుందరీకరణ చేస్తా
‘‘గతంలో ఎన్నో ప్రాజెక్టులకు భూసేకరణ జరిపినప్పుడు లేని ఇబ్బంది మూసీ విషయంలో ఎందుకు? ఆ కుటుంబాలు జీవితాంతం మురికిలోనే ఉండాలా? వారిని బాగు చేసే బాధ్యత ప్రభుత్వంతీసుకుంటుంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించటంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మూసీ పరిధిలో 10వేల కుటుంబాలు ఉన్నాయని 33 బృందాలు ఆరునెలల పాటు సర్వే చేసి తేల్చాయి.
బఫర్ జోన్‌లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రాజెక్టును అడ్డుకోవడం కాదు.. కావాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు తగలబెట్టిన వారికి ఇది తెలియదా? ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆర్‌ఎస్ నేతల తరహాలోనే మూసీ ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు.
ఆయన అంగీ మార్చినా బీఆర్‌ఎస్ వాసనను వదిలించుకున్నట్టు లేదు. సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేద్దాం. కేంద్రం నుంచి ఓ 20 వేల కోట్లు వచ్చేలా బీజేపీ ఎంపీలు చేయలేరా? పరామర్శల పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాలకు వచ్చే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను ఓ వారంపాటు అక్కడే ఉంచితే ఆ ప్రాంత జనం కష్టాలేమిటో తెలిసి వస్తాయి.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి ప్రభుత్వ పెద్దలు.. నియామకాలను పట్టించుకోలేదు. వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించటం తమ బాధ్యతగా భావించకపోవటం వల్ల ఏళ్ల తరబడి నియామకాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే నాటి సీఎం, మంత్రుల కుర్చీల్లో కూర్చున్న వారి ఉద్యోగాలు ఊడాలని విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో చెప్పాను. దాన్ని మీరు చేసి చూపించారు. మా కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూస్తూ.. మేం సీఎంగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు కల్పిస్తూ.. నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసేలా నియామక పత్రాలను అందించాం.
ఇప్పుడు దసరా ముందు 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించటం ద్వారా వారి కుటుంబాలు మరింత ఆనందంగా పండుగ నిర్వహించుకునేలా చేశాం. మరో 11,063 మందికి ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించబోతున్నాం.
భాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం వరకు దశాబ్దాలుగా నిలబడి ఉండేలా కట్టిన నాటి ఇంజినీర్లను, హైదరాబాద్ వెలుపల జంట జలాశయాలకు ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ఆదర్శంగా తీసుకుంటారా? లేక కట్టిన కొన్నేళ్లకే కూలిపోయిన కాళేశ్వరాన్ని నిర్మించిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఉద్యోగులు, ఇంజనీర్లు నిర్ణయించుకోవాలి.
కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఇంజనీర్ల చేతుల మీదుగా రీజనల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతున్నాయి. చెక్‌డ్యామ్‌లు మొదలు కాళేశ్వరం వరకు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల నాణ్యత డొల్లతనాన్ని చూపిస్తాం రండి.. నాటి మంత్రులకు ఇదే నా సవాల్. అని అన్నారు.