Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది క్రమంగా ఒడిశా, ఏపీ తీరం వైపు పయనించే సూచనలున్నట్లు తెలిపింది. అయితే.. ఇది తుపానుగా బలపడే అవకాశాలు లేవనీ.. కేవలం అల్పపీడనం లేదా వాయుగుండంగా మాత్రమే బలపడుతుందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నేడు ఏపీలోని ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం, భారీ వర్షాలతో గర్బగుడిలోకి ప్రవేశించిన నీరు..వీడియో ఇదిగో
ఇక గతమూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Telugu States Rain Alert) కురుస్తున్నాయి. మరో 3, 4 రోజులు వానలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. నేడు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, నిన్న జనగామ జిల్లా దేవరుప్పలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
సాగర్ కాల్వకు మరోసారి గండి, నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు..వీడియో ఇదిగో
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిన్న అత్యధికంగా జనగామ జిల్లాలోని దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోని పలుచోట్ల నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ గాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
సరూర్‌నగర్, రాక్ టౌన్ కాలనీ, నాగోల్‌లో అత్యధికంగా 86 మి.మీ., బండ్లగూడలో 75.5 మి.మీ., హబ్సిగూడలో 70.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రామాంతపూర్‌లో 51 మి.మీ., హయత్‌నగర్‌లో 50.55 మి.మీ., ఉస్మానియా యూనివర్సిటీలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక జామ్ అయింది.
రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ కోసం 040-21111111, 90001 13667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.