Ban On Basmati Rice Exports: నిన్న ఉప్పుడు బియ్యం, ఇవాళ బాస్మతి బియ్యంపై కేంద్రం ఆంక్షలు, అన్ని రకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు
ఈ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలవుతుంది.
New Delhi, AUG 27: అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై (Basmati Rice Exports) కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలవుతుంది. ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. వచ్చే అక్టోబర్ 16 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ ఏడాది పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించి కేంద్రం. గతేడాది 74 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారు. దేశీయంగా ఉప్పుడు బియ్యం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో.. దేశీయంగా అవసరాలకు సరిపడా బియ్యం స్టాక్ నిర్వహణ కోసం ఎగుమతిపై నిషేధం విధించింది.
విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతిపై కేంద్రం సుంకం విధించడంతో పాకిస్థాన్, థాయిలాండ్ దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. విదేశీ వ్యాపారులు సైతం ఇతర దేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పై చిలుకే. గత నెలలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా బియ్యం సరఫరా పెంపుదలకు, ధరల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నది. బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.