G20 Summit (Photo-ANI)

భారత్ ఆధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కమీషనర్ ఎస్ఎస్ యాదవ్ తెలిపారు. ఐరోపా దేశాల తోపాటు 19 ఇతర దేశాలు పాల్గొనే ఈ సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. ఢిల్లీ వేదికగా భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఢిల్లీ ట్రాఫిక్ కమీషనర్ ఎస్ఎస్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఆంక్షలు సెప్టెంబర్ 8 సాయంత్రం మొదలై సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే తప్పక తమ హోటల్ బుకింగ్ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుందని అన్నారు. రవాణాకు సంబంధించి అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవు కానీ కార్గో ట్రక్కులను, నగరం బయటే నిలిపివేస్తామని, డీటీసీ సేవలు కూడా అందుబాటులో ఉండవని.. మెట్రో సేవలు మాత్రమే అందుబాటులోనే ఉంటాయని ప్రయాణికులు మెట్రో ద్వారా ప్రయాణించాలని కోరారు.

ప్రధాని మోదీ డిగ్రీ కేసు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఈ మూడు రోజులు ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్‌లకు వెళ్లవద్దనీ ఏమి కావాలన్నా ముందే తెచ్చి పెట్టుకోవాలని అన్నారు. మథుర రోడ్, బైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్‌లలో పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు తెలుపుతూ ఎయిర్‌పోర్టుకు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు ముందుగానే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వర్చువల్ హెల్ప్ డెస్క్ సేవలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు.