IPL Auction 2025 Live

Coronavirus in India: భారత్ లోనూ విస్తరిస్తున్న కరోనా వైరస్, మళ్ళీ కేరళ రాష్ట్రం నుంచే మూడవ పాజిటివ్ కేసు నమోదు, చైనా నుంచి భారతీయులను ఖాళీ చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఇప్పటికే శనివారం 324 మంది భారతీయులను దిల్లీ తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా విమానం, ఆదివారం రోజు మరో 323 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది.....

Coronavirus in India (Photo Credits: IANS)

Kasargod, February 3:  భారత్ లోనూ ప్రాణాంతక కరోనావైరస్ విస్తరిస్తుంది. కేరళలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మళ్ళీ అదే రాష్ట్రం (Kerala) నుంచే మూడవ పాజిటివ్ కేసు (third nCoV positive case) నమోదవడం ఆందోళన కలిగించే విషయం. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో సోమవారం ఓ వ్యక్తికి నోవెల్ కరోనావైరస్ (2019-nCoV) సోకినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. బాధితుడిని కంజంగాడ్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, వైద్యులు అతడి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

గత గురువారం కేరళలో తొలి కరోనా వైరస్ (Coronavirus ) పాజిటివ్ కేసు నమోదైంది. ఆమె త్రిస్సూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, రెండో కేసు అలప్పుజ జిల్లాలో ఆదివారం నమోదైంది. మూడోది ఈరోజు కాసర్గోడ్ జిల్లాలో నమోదైంది. ఈ ముగ్గురు కూడా గత నెలలో చైనాలోని వుహన్ నగరం నుంచి తిరిగివచ్చిన వారే.

తమ రాష్ట్రం నుంచి మూడో పాజిటివ్ కేసు నమోదవడం పట్ల కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ స్పందించారు. ప్రస్తుతం కరోనావైరస్ కు వాక్సిన్ లేకపోయినా, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. చైనాలో తమ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. ఆ దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందని వార్తలు విన్నప్పుడు, ఆ దిశగా ముందస్తుగానే కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు భారతదేశంలో nCov కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని స్పష్టం చేశారు. ఇక ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

చైనాలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వుహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశం రప్పించే (Airlift) ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే శనివారం 324 మంది భారతీయులను దిల్లీ తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా విమానం, ఆదివారం రోజు మరో 323 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది.

అలాగే భారత ప్రజలు చైనా పర్యటనలు విరమించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు జారీచేసింది. ఇక భారత్ వచ్చే చైనా పౌరులకు జారీ చేసిన వీసాలను కూడా భారత ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటివరకు చైనాలో ప్రాణాంతక కరోనావైరస్ (2019-nCoV) కారణంగా మరణించిన వారి సంఖ్య 300 కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో 45 మంది మృతిచెందినట్లు సమాచారం.

 



సంబంధిత వార్తలు