Tomato Flu in India: దేశంలో చిన్న పిల్లలను వణికిస్తున్న మరో మిస్టరీ వ్యాధి, 82 మంది పిలల్లకు టమాటో ఫ్లూ, టమాటో జ్వరం లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి తెలుసుకోండి
దేశంలో సుమారు 82 మంది పిల్లలు (India logs 82 cases of ‘Tomato Fever) ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ (Lancet issues alert) పేర్కొంది.
New Delhi, August 20: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇండియాను మరో వ్యాధి వణికించేందుకు రెడీ అయింది. దేశంలో సుమారు 82 మంది పిల్లలు (India logs 82 cases of ‘Tomato Fever) ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ (Lancet issues alert) పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులంతా ఐదేళ్ల లోపు వారేనని (children below 5 years) తెలిపింది. ఇది పేగు వైరస్ వల్ల వస్తుందని, పెద్దల్లో అరుదుగా సంభవిస్తుందని చెప్పింది.
ఇది గత మే నెలలో కేరళలోని కొల్లంలో మొదలైంది. ఈ వ్యాధి రోగి శరీరంపై ఎర్రగా నొప్పితో కూడిన పొక్కులు వచ్చి టొమాటో సైజులో పెద్దవిగా ఉంటుంది. అందువల్ల దీనిని టోమోటో ఫ్లూ అని పిలుస్తారు. దీని వల్ల చేతులు, పాదాలు, నోటి పై ఎర్రటి బాధకరమైన బొబ్బలు వస్తాయి . ఇప్పటి వరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను కేరళ, ఒడిశాలో గుర్తించారు.
ఈ వ్యాధి బారిన పడిన రోగి అచ్చం చికెన్‌గున్యా లాంటి లక్షణాలను ఎదుర్కొంటాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాధి కేరళలో అత్యధికంగా ప్రబలడం వల్ల తమిళనాడు, ఒడిశా, కర్ణాటక అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అదీగాక ఒడిశాలో భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సుమారు 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొందని నివేదికలో వెల్లడించింది.
ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, ఒడిశా తప్ప భారత్‌లోని మరే ప్రాంతాలు ఈ వైరస్ బారిన పడలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా కోల్లాం ప్రాంతం ప్రధానంగా ఈ వ్యాధి విస్తరిస్తుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు అంతా. మరోవైపు ఈ ఇన్‌ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
టమాటో ఫ్లూ అనేది అరుదైన డిసీజ్. ఇంతకు ముందు ఏయే దేశాల్లో, ప్రాంతాల్లో ఈ వైరస్ సోకిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఏ కారణం చేత వ్యాపిస్తుంది అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కానీ, ఈ ఫ్తూ వల్ల ఒంటిపై ఎరుపు రంగు దద్దుర్లు వస్తాయి. డీహైడ్రేషన్‌తో పాటు చికాకుగా అనిపిస్తుంటుంది. ఆ బొబ్బలు టమాటో ఆకారంలో ఉండడంతోనే.. ఈ వ్యాధికి టమాటో ఫ్లూ అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల మీదే ఈ ఫీవర్ ప్రభావం కనిపిస్తోంది.
లక్షణాలు: టమాటో ఆకారంలో బొబ్బలు రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణం. దీంతో పాటు చికున్‌గున్యా తరహాలోనే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కనిపిస్తాయి. కేరళలోని కోల్లాంతో పాటు దక్షిణ ప్రాంతాలైన అర్యన్‌కావు, అంచల్, నెడువతుర్ ప్రాంతాల్లోనూ కేసులు నమోదు అవుతున్నాయి.
సరిహద్దులో నిఘా: ఈ మిస్టరీ వ్యాధి కలకలంతో.. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తం అయ్యింది. ఇరు రాష్ట్రాల ప్రయాణాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వేగంగా ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిస్తుండడంతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం తప్పదని వైద్యాధికారులు చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొయంబత్తూరు(తమిళనాడు) ప్రవేశించే దారుల గుండా పరీక్షలు మొదలుపెట్టారు.
అలాగే వలయార్‌లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు.. ప్రయాణికులను ప్రత్యేకించి పిల్లలను పరీక్షిస్తున్నారు. అదే సమయంలో అంగన్‌వాడీల్లో 24 సభ్యులతో కూడిన బృందం సైతం పరీక్షలు నిర్వహిస్తోంది. టమాటో ఫ్లూ పై పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇన్‌ఫెక్షన్ సోకిన పిల్లలకు.. ఇతర పిల్లలను దూరంగా ఉంచాలని, డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలని, అలాగే వైద్య పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.