PM Modi Twitter Hack: ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్, వివరణ ఇచ్చిన ట్విట్టర్, దేశంలో కలకలం
ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సైతం ధృవీకరించింది. అయితే కొంతసేపటికే ట్విటర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించినట్లు ట్వీట్ చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం సైతం ధృవీకరించింది. అయితే కొంతసేపటికే ట్విటర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించినట్లు ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ ద్వారా బిట్‌కాయిన్‌లు కొనాలంటూ కొందరు ఆగంతకులు పోస్టులు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతుందన్న లింక్‌లను ఆగంతకులు పోస్ట్ చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే ట్విటర్ సంస్థకు సమాచారం అందించింది. కాసేపటి తర్వాత ఈ అకౌంట్ పునరుద్ధరణ జరిగిందంటూ పీఎంఓ ప్రకటించింది. హ్యాకింగ్ సమయంలో నమోదైన ట్వీట్‌లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం మీడియాకు విజ్ఞప్తి చేసింది.
అయితే.. ప్రధాని మోదీ ఖాతా హ్యాకింగ్‌పై ఘటనపై ట్విట్టర్ స్పందించింది. ఈ హ్యాకింగ్ గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్‌ను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ ఆదివారం స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయంతో తాము 24 గంటలపాటు ఓపెన్ లైన్‌లను కలిగి ఉన్నామమని, దీని గురించి తమకు తెలిసిన వెంటనే తమ బృందాలు ఖాతాను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాయని తెలిపింది. ఈ సమాచారం వచ్చిన వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతాను రీస్టోర్ చేసినట్లు వెల్లడించింది.