Pawan Kalyan: జనసేన పార్టీ మద్ధతుదారుల 400 ట్విట్టర్ ఖాతాల తొలగింపు. ప్రజాసమస్యలపై ప్రశ్నించడమే తప్పా? అని నిలదీసిన పవన్ కళ్యాణ్. వెంటనే తొలగించిన ఖాతాలను పునరుద్ధరించాలని డిమాండ్

దీనికి కారణం జగన్ ప్రభుత్వమే అంటూ వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేస్తుందంటూ...

Janasena Party Chief Pawan Kalyan | File Photo.

Amaravathi, September 18: జనసేన పార్టీకి సంబంధించిన దాదాపు 400 ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా తొలగించింది. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రియాక్ట్ అయ్యారు. అసలు వాటిని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం (JSP Social Media) ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తుంది. వాటిని కూడా ట్విట్టర్ తొలగించడమేంటని ఆయన నిలదీశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల పక్షాన నిలబడటమే తప్పా? దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటూ ఆయన ప్రశ్నించారు. వెంటనే తొలగించిన ఖాతాలను పునరుద్ధరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Pawan Kalyan Tweet:

జనసేన (Janasena) ట్విట్టర్ ఖాతాలను తొలగించటం పట్ల జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జగన్ ప్రభుత్వమే అంటూ వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేస్తుందంటూ #BringBackJSPSocialMedia హాష్ టాగ్‌ను వారు ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను జనసేన ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతోనే తమ ట్విట్టర్ ఖాతాలను ప్రభుత్వం బ్లాక్ చేసిందంటూ వారు విరుచుకుపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ప్రజాసమస్యలపై ట్విట్టర్ వేదికగా ఆయన ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటారు. గత కొంతకాలంగా జగన్ సర్కార్ పై అనేక విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.