Bus Catches Fire: ఢిల్లీ - జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు, నిద్రలోనే ఇద్దరు సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు
ఢిల్లీ – జైపూర్ హైవేపై బుధవారం రాత్రి స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో (Bus Catches Fire) ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్గావ్ పోలీసులు తెలిపారు.
New Delhi, NOV 09: ఢిల్లీ – జైపూర్ హైవేపై (Delhi Jaipur Highway) బస్సులో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఢిల్లీ – జైపూర్ హైవేపై బుధవారం రాత్రి స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో (Bus Catches Fire) ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని గుర్గావ్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 31లోని ఫ్లైఓవర్‌పై రాత్రి 9 గంటలకు ప్యాసింజర్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే కమిషనర్ సహా అగ్నిమాపక బృందం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఏసీపీ (Crime) వరుణ్ దహియా తెలిపారు. ఫైరింజన్లతో అగ్నిమాపక బృందం మంటలను ఆర్పివేశారని పేర్కొన్నారు.
గాయపడిన వారందరినీ రక్షించి బస్సు లోపల నుంచి బయటికి తీసుకొచ్చారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం గాయపడిన వారి స్టేట్‌మెంట్‌లను అధికారులు తీసుకోనున్నారని చెప్పారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున వారిని గుర్తించలేదు. కాగా, బస్సు గుర్గావ్ సెక్టార్ 12 నుండి ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు వెళ్తోందన్నారు.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ నుంచి మూడు ఫైరింజన్లు ఉపయోగించినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రమేష్ సైనీ తెలిపారు. 1.5 గంటల పాటు ఆపరేషన్లు కొనసాగాయని, ఆ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. చాలా సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.