UK PM Boris Johnson: భారత్‌లో పర్యటించనున్న యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ప్రధాని మోదీతో యూకే – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపే అవకాశం
ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో యూకే – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ( India-UK Free Trade Agreement) జరిపే అవకాశం ఉన్నది
యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో యూకే – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ( India-UK Free Trade Agreement) జరిపే అవకాశం ఉన్నది. కాగా గత ఏడాది నవంబర్‌లో గ్లాస్గో వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ (UK PM Boris Johnson) భేటీ అయ్యారు.
బోరిస్ జాన్సన్ (British Prime Minister) గతేడాదే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా.. రెండుసార్లు ఈ పర్యటన వాయిదా పడింది. గతేడాది జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా.. యూకేలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో రద్దయ్యింది. గత ఏడాది యూకే అధ్యక్షతన జరిగిన జీ7 దేశాల సమావేశానికి హాజరు కావాలని యూకే ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. మేలో జరిగిన వర్చువల్ సమ్మిట్‌లో బ్రిటన్ ప్రధానితో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’పై చర్చించారు. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు.
ఆరోగ్యం, వాతావరణం, వాణిజ్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ, రక్షణలో యూకే, భారత్ కలిసి పని చేయాలని నిర్ణయించారు. గత నెలలో యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ ఢిల్లీలో పర్యటించారు. అంతకు ముందు అక్టోబర్‌లోను ఆమె భారత్‌కు వచ్చారు. బ్రిగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే వాణిజ్య అవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు సిద్ధమయ్యారు.