Caller ID Display Service: సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరు కాల్ చేశారో...ప్రతి ఒక్కరికి తెలిసేలా కొత్త రూల్ తెచ్చిన ట్రాయ్
ఏ నంబర్ నుంచి ఇన్ కమింగ్ కాల్ (Incoming Call) వచ్చినా ఆ వ్యక్తి పేరు చూపడం ఈ కాలర్ ఐడీ ప్రధానోద్దేశం. ఈ విషయమై సుముఖంగా లేకున్నా ఇటు ట్రాయ్.. అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో టెలికం కంపెనీలో పరిమిత సంఖ్యలో ‘కాలర్ ఐడీ’ (Caller ID) ప్రయోగాలు చేపట్టాయి.
New Delhi, June 15: టెక్నాలజీ పెరిగినా కొద్దీ లాభాలతోపాటు మోసాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో.., రూ.కోట్లల్లో స్వాహా చేస్తున్నారు. సైబర్ మోసాలకు అడ్డు కట్ట వేసేందుకు ఆర్బీఐ (RBI), ట్రాయ్ (TRAI), కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా, సైబర్ మోసగాళ్లు రూట్ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ యూజర్ల ప్రయోజనాల కోసం టెలికం కంపెనీలే ‘కాలర్ ఐడీ (Caller ID)’ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఏ నంబర్ నుంచి ఇన్ కమింగ్ కాల్ (Incoming Call) వచ్చినా ఆ వ్యక్తి పేరు చూపడం ఈ కాలర్ ఐడీ ప్రధానోద్దేశం. ఈ విషయమై సుముఖంగా లేకున్నా ఇటు ట్రాయ్.. అటు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో టెలికం కంపెనీలో పరిమిత సంఖ్యలో ‘కాలర్ ఐడీ’ (Caller ID) ప్రయోగాలు చేపట్టాయి.
మున్ముందు మరిన్ని నగరాల్లో ‘కాలర్ ఐడీ’ ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ను (Fraud Calls) అడ్డుకునేందుకు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ తేవాలని ట్రాయ్ చేసిన ప్రతిపాదనను సాంకేతిక కారణాల సాకుతో తొలుత టెలికం కంపెనీలు వ్యతిరేకించాయి. కానీ కేంద్రం, ట్రాయ్ ఒత్తిడి తేవడంతో కాలర్ ఐడీ పనితీరు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆచరణ సాధ్యమా? లేదా? అనే విషయమై కేంద్ర ప్రభుత్వానికి టెలికం సంస్థలు నివేదిక సమర్పిస్తాయి. ప్రస్తుతం ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ సంస్థలు ఇదే తరహా సేవలు అందిస్తున్నాయి. కానీ, టెలికం కంపెనీలే తమ మొబైల్ డేటాలని నంబర్లను కాలర్ ఐడీలో చూపడం ప్రయోజనకరం అని కేంద్రం, ట్రాయ్ భావిస్తున్నాయి.