Uttarakhand Glacier Burst Updates: దేవభూమిలో అసలేం జరిగింది? మృత్యుఘోషకు కారణాలు ఏంటీ? ఇంకా కానరాని 170 మంది ఆచూకి, కొనసాగుతున్న సహాయక చర్యలు, ఉత్తరాఖండ్ విలయంపై ప్రత్యేక కథనం
చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద ఆదివారం నందా దేవి హిమానీనదం (గ్లేసియర్) విరిగిపడటంతో గంగానది ఉపనదులైన ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు ఆకస్మికంగా వరదనీరు (Uttarakhand Glacier Burst) పోటెత్తింది.
Dehradun, February 8: దేవభూమి (ల్యాండ్ ఆఫ్ గాడ్స్) ఉత్తరాఖండ్‌పై మరో జలప్రళయం విరుచుకుపడిన విషయం విదితమే. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద ఆదివారం నందా దేవి హిమానీనదం (గ్లేసియర్) విరిగిపడటంతో గంగానది ఉపనదులైన ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు ఆకస్మికంగా వరదనీరు (Uttarakhand Glacier Burst) పోటెత్తింది. నీటి ఉద్ధృతికి రెండు పవర్ ప్రాజెక్టులు (ఎన్టీపీసీకి చెందిన తపోవన్-విష్ణుగఢ్, రిషిగంగా) తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆకస్మికంగా సంభవించిన జల విలయం (Uttarakhand Glacier) ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం, కొంతమంది తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన శవాలుగా మిగిలిపోవడం కలవరానికి గురిచేస్తోంది.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేసినప్పటికీ వారి అచూకీ లభ్యంకాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయిన 170 మంది మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల్లో జల్లెడపడుతున్నా కొద్దీ శవాలు బయపడుతున్నాయి. ఇప్పటి వరకు 10 శవాలను గుర్తించగా.. మొత్తం 16 మందిని సహాయ బృందాలు కాపాడగలిగాయి.
ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందన్నారు. రెండో తపోవన్ టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అయితే వారి అచూకీ లభించకపోవడం ఆందోళక కలిగిస్తోందన్నారు.
కొండచరియలు విరిగిపడిన అనంతరం సంభవించిన వరదల కారణంగా పలు గ్రామాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు ఎన్డీఆర్ఎఫ్, ఐఎఎఫ్ బృందాలు సహాయం అందిస్తున్నాయి. మూడు హెలికాప్టర్ల సాయంతో ఐఎఎఫ్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదల కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన 13 గ్రామాల్లోని ప్రజలకు హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.
పెద్దపెద్ద యంత్రాల సాయంతో విరిగిపడిన కొండచరియలను తొలగించి సహాయక చర్యలు చేపడుతున్నారు. చమోలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకూ వివిధ ప్రాంతాల నుంచి 14 మృతదేహాలను బయటకు తీశారు. సొరంగంలో చిక్కుకున్న 15 మందిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు జేసీబీ సాయంతో లోనికి వెళ్లే దారిని ఏర్పాటు చేస్తున్నారు.
ఈరోజు ఉదయానికి నీటి ఉధృతి కాస్త తగ్గడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తపోవన్ ప్రాజెక్టు సమీపంలో బురద పేరుకుపోయింది. ఐటీబీపీ జవానులు సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే లోపలి ప్రాంతమంతా బురదమయంగా ఉండటంతో రకరకాల యంత్రాలను వినియోగిస్తూ మార్గం ఏర్పాటు చేస్తున్నారు.
గత జల ప్రళయాలు: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న జల ప్రళయం.... 2013, జూన్ 16న జరిగిన కేదార్‌నాథ్ ఉపద్రవాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పుడు ఎడతెరిపిలేని వర్షాల ధాటికి వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 5,700 మంది మృత్యువాతపడి ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. చార్‌ధాం యాత్రా మార్గంలోని పలుచోట్ల దాదాపు 3లక్షల మంది చిక్కుకుపోయారు. ఇది చరిత్రలో ఒక దారుణమైన జల ప్రళయంగా మిగిలిపోయింది.
అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ప్రకృతి కాస్త దయ చూపిందని చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా పగటిపూట ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో, సహాయక చర్యలు వేగంగా చేపట్టగలిగారు.
1991లో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు కాకముం దు ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. దాని తీవ్ర త రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. 768 మం ది చనిపోగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.1998లో కొండచరియలు విరిగిపడి ఏకంగా పితోరాగఢ్ జిల్లాలోని మల్పా అనే గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 255 మంది చనిపోయారు. వీరిలో కైలాశ్ మానససరోవర్ యాత్రికులు 55 మంది ఉన్నారు. ఆ శిథిలాల వల్ల శారదా నది ప్రవాహానికి కొంతమేర ఆటంకం కలిగింది. 1999లో చమోలి జిల్లాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 100 మంది వరకూ మరణించారు. భూకంప ధాటికి పొరుగు జిల్లా అయిన రుద్రప్రయాగలో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు బీటలువారాయి.
ముంచిన నందాదేవి హిమానీనదం: కాగా ఉత్తరాఖండ్‌లో జలవిలయానికి కారణం నందాదేవి హిమానీనదం. ఆదివారం నందాదేవి పర్వతం ఉత్తర దిక్కున ఉన్న భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. హిమానీనదం పట్టి ఉంచిన నీరు ధౌలీగంగా నదిలో కలిసి ఉప్పొంగి ప్రమాద తీవ్రత పెరిగింది. మంచు అడుగున నీటి ఒత్తిడి పెరగడం, భూకంపాలు, మంచు పలకలు కోతకు గురవడం వల్ల హిమానీనదాలు కూలిపోతాయి. దీంతో నీరు ఎగదన్నుకువచ్చి ప్రమాదాలు జరుగుతాయి. నందాదేవి పర్వతం దేశంలోనే ఎత్తైన పర్వతాల్లో రెండోది. నందాదేవి కంటే ఎత్తైనది కాంచనగంగా పర్వతం. నిజం చెప్పాలంటే.. పూర్తిగా భారత భూభాగంలోనే ఉన్న పర్వతాలపరంగా లెక్కిస్తే నందాదేవి మొదటిది. కాంచనగంగా నేపాల్ సరిహద్దుల్లో ఉన్నది.
జల ప్రళయానికి కారణాలు ఏంటీ ?
నందాదేవి పర్వతంపై జరిగిన ‘గ్లేషియర్ బరస్ట్’ వల్ల వరద పోటెత్తింది. సాధారణంగా మంచు పర్వతాలపై ఉండే హిమనీ నదాలను గ్లేసియర్స్ అంటారు. మన గంగానది సహా.. ప్రపంచంలో చాలా నదులకు ఈ హిమనీనదాల నుంచి వచ్చే నీరే ఆధారం. ఈ హిమనీనదాల్లో ఉండే మంచు గడ్డల లోపలి భాగాల్లో నీరు ప్రవహిస్తుంటుంది. లోపల నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మంచుగడ్డ ఒక్కసారిగా పగులుతుంది.
ఆ ఊపుకు లోపలి నుంచి నీరు ఉధృతమైన వేగంతో ఒక్కసారిగా బయటకు దూకుతుంది. దీన్నే గ్లేషియర్ బరస్ట్ అంటారు. ఈ నీరు ఎందుకు కరుగుతుందంటే.. పర్యావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జరుగుతూ ఉంటుంది. నిజానికి హిమాలయాల్లోని మంచునదులకు ఈ తరహా ముప్పు ఉందని పేర్కొంటూ సరిగ్గా ఏడాది క్రితం ఒక అధ్యయన నివేదిక వెలువడింది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగితే చాలు.. 2100 నాటికి ‘హిందుకుష్ హిమాలయన్ (హెచ్‌కేహెచ్) ప్రాంతం’లోని హిమనీనదాలు మూడో వంతు మేర కరిగిపోతాయని ఆ నివేదిక హెచ్చరించింది.
హిందుకుష్ హిమాలయన్ ప్రాంతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మియన్మార్, చైనా దేశాల్లో 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన సువిశాల ప్రాంతం. దీన్ని ‘థర్డ్ పోల్ (మూడో ధ్రువం)’గానూ వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ధ్రువాల తర్వాత మంచినీరు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ హిందుకుష్ హిమాలయన్ ప్రాంతమే. అలాగే.. ‘ప్రపంచపు అత్యంత ముఖ్యమైన నీటి బురుజు’గా కూడా ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలం ఈ ప్రాంతం.
ఎనిమిది దేశాల్లోని దాదాపు 180 కోట్ల మందికి నీటి అవసరాలు తీర్చే ప్రాంతమిది. అంతేకాదు.. ప్రపంచంలోని నాలుగు జీవ వైవిధ్య హాట్‌స్పాట్లలో ఇదీ ఒకటి. హెచ్‌కేహెచ్ ప్రాంతంలోని హిమనీనదాలన్నీ 7 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని అంచనా. అప్పటి నుంచి 1970 దాకా వాటికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ.. ఆ దశకంలో మొదలైన భూతాప సమస్య శ్రుతి మించుతుండడంతో హిమనీనదాలు కరగడం ప్రారంభమైంది.