Dehradun, February 7: ఉత్తరాఖండ్‌లో భారీ మంచుకొండ విరిగిపడటంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. మంచు ఖండం కరగడంతో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో (Uttarakhand Floods) చిక్కుకున్నాయి. చమోలీ జిల్లాలోని జోషి మఠ్‌లో ధౌలి గంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది. చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద పవర్ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరింది.
అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. కాగా వరదల ప్రభావం ఉత్తర ప్రదేశ్‌పై కూడా పడింది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ధౌలిగంగా నదికి అనూహ్యంగా పెద్ద ఎత్తున వరద రావడంతో పవర్‌ప్లాంట్ వద్ద మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. మంచుచరియలు విరిగిపడటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. భారీ వరద ప్రవాహానికి ఆనకట్ట కొట్టుకునిపోయింది. వరద నీరు ప్రవేశించడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టులోని పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ఇండో-టిబెటిన్ సరిహద్దు పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Water level in Dhauliganga river:
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhand pic.twitter.com/syiokujhns
— ANI (@ANI) February 7, 2021
ఉత్తరాఖండ్‌లోని నందాదేవి మంచు ఖండం విరిగి, కరిగినట్లు సమాచారం అందిందని ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. గంగా నది పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నీటి స్థాయిని నిరంతరం గమనించాలని తెలిపారు. అవసరమైతే ప్రజలను వేరొక చోటుకు తరలించాలని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పీఏసీ ఫ్లడ్ కంపెనీలను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వరద సహాయ కార్యక్రమాలను స్థానికంగా సమన్వయపరచాలని పేర్కొన్నారు.
ధౌలి గంగలో భారీ వరదల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రెండు ఐటీబీపీ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలిపారు. డెహ్రాడూన్ నుంచి భారత వాయు సేన హెలికాప్టర్‌లో మరొక మూడు బృందాలు చేరుకుంటాయన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. వరదల్లో జోషీమఠ్-మలరి వంతెన కొట్టుకుపోయింది.
భారత సైన్యం సరిహద్దు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వంతెన ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఐటీబీపీ సమన్వయంతో వ్యవహరిస్తోంది. గౌషర్‌లోని ఐటీబీపీ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరింది.
HM Amit Shah Statement:
#WATCH | 3 NDRF teams have reached there. More teams are ready to be airlifted to Uttarakhand from Delhi. ITBP jawans are also there. I assure people of Uttarakhand that Modi govt stands with them in this difficult time. All help will be extended: HM Amit Shah pic.twitter.com/lYxOhr8T2Y
— ANI (@ANI) February 7, 2021
వంతెనల నిర్మాణంలో నిపుణులైన ఐటీబీపీ సిబ్బంది కూడా బయల్దేరారు. జోషీమఠ్ నుంచి 200 మంది సిబ్బందిని ఐటీబీపీ పంపించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయపడేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. డిజాస్టర్ ఆపరేషన్స్ సెంటర్ నంబర్ 1070 లేదా 9557444486కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
పాత వీడియోలను చూపిస్తూ వందంతులు ప్రచారం చేయవద్దని ట్విటర్ వేదికగా కోరారు. భారీ వర్షాలు, అకస్మాత్తుగా వస్తున్న నీటి వల్ల చమోలీలోని రుషి గంగ గ్రామంలో రిషి గంగ ప్రాజెక్టుకు నష్టం జరగవచ్చునని తెలిపారు. నదిలోకి నీరు అకస్మాత్తుగా అధికంగా వస్తున్నందువల్ల అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు.
తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా భాగీరథి నదీ ప్రవాహాన్ని నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలకనంద ప్రవాహాన్ని నిరోధించేందుకు శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీ చేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అధికారులు తెలిపే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు.
రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, తపోవన్-రిని ప్రాంతంలోని రుషి గంగ పవర్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. అయితే ప్రస్తుతం వరదల పరిస్థితి నియంత్రణలో ఉంది. ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితిపై తాను నిరంతరం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని అందరి క్షేమం, రక్షణ కోసం యావత్తు దేశం ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో నిరంతరం మాట్లాడుతున్నానని, ఎన్‌డీఆర్ఎఫ్ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నారు. ఉత్తరాఖండ్ వరదలపై ఆయన సమీక్ష జరిపారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఓ ట్వీట్‌లో తెలిపింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఇతర ఉన్నతాధికారులతో మోదీ మాట్లాడారని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న సహాయ కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకున్నారని తెలిపింది.
వరద ప్రభావిత ప్రజలకు అవసరమైన సహాయం సాధ్యమైనంతగా అందజేసేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, ఐటీబీపీ డీజీ ఎస్ఎస్ దేశ్వాల్‌లతో మాట్లాడారు. వరద పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లో నందాదేవి మంచుదిబ్బపై హిమపాతం కారణంగా వరదలు పోటెత్తిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తంచేశారు. ఆకస్మిక వరదల కారణంగా స్థానికంగా జరిగిన విధ్వంసం తన తీవ్రంగా బాధించిందని ఆయన పేర్కొన్నారు. వరదల్లో గల్లంతైన వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై రక్షణ, పునరావాస చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.