Covid Updates in india: ఇండియాలో మరో ఏడు వ్యాక్సిన్లు, సౌతాఫ్రికా కరోనాపై పనిచేయని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్, దేశంలో కొత్తగా 12,059 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 150 కేసులు, ఏపీలో 75 కొత్త కోవిడ్ కేసులు నమోదు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Feb 7: దేశంలో కొత్తగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. కొత్తగా 11,805 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,22,601 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి తాజాగా 78 మంది మృతి (Covid Deaths) చెందారు. మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్‌ కేసులు (Covid Updates in india) ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. శనివారం దేశవ్యాప్తంగా 6,95,789 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 20,13,68,378 టెస్టులు చేసినట్లు వివరించింది.

ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 34,805 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 150 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,032 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,610 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,939 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 808 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 25 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ (Andhra Pradesh Coronavirus) వ్యాప్తి మరింతగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 34,864 కరోనా టెస్టులు నిర్వహించగా 75 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో ఒక కేసును గుర్తించారు. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,179 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,012 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,159కి చేరింది.

కదిలేది లేదు..రోడ్ల పైనే వ్యవసాయం చేస్తాం, అక్టోబర్ 2 వరకు ఇక్కడే కూర్చుంటామని తేల్చి చెప్పిన రైతు సంఘాలు, గాంధీ జయంతి వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని వెల్లడి

భారత దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ లకు అదనంగా మరో ఏడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. వీటిల్లో మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయని, మరో రెండు ప్రీ క్లినికల్ దశలో ఉండగా, ఒకటి ఫేజ్ 1, మరోటి ఫేజ్ 2 దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్లలో దేన్నీ అత్యవసరంగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు, ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియాలో వ్యాక్సినేషన్ మూడవ దశను త్వరలోనే ప్రారంభించనున్నామని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సౌతాఫ్రికా కొవిడ్ వేరియంట్ పై చాలా తక్కువ ప్రభావాన్నే చూపుతోందని ఆస్ట్రాజెనికా ప్రకటించింది. దక్షిణాఫ్రికా వేరియంట్ పై తాము చేసిన పరిశోధనల ప్రాథమిక ఫలితాల అనంతరం ఈ విషయం తెలిసిందని పేర్కొంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై సౌతాఫ్రికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ విట్ వాటర్స్రాండ్, ఆక్స్ ఫర్డ్ తో కలిసి కొత్త స్ట్రెయిన్ పై పరిశోధనలు సాగించింది. దీని ఫలితాలు 'ఫైనాన్షియల్ టైమ్స్'లో ప్రచురితం అయ్యాయి.

మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్‌ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

సౌతాఫ్రికా వేరియంట్ తో పాటు బ్రిటీష్, బ్రెజిల్ కరోనా వేరియంట్ పైనా తాము పరిశోధనలు సాగించామని, ఇవి మామూలు కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది. "సౌతాఫ్రికా స్ట్రెయిన్ సోకి స్వల్ప లక్షణాలు కనిపించే వారిలో మా వ్యాక్సిన్ పరిమిత ప్రభావాన్నే చూపిందని ఫేజ్ 1, 2 ట్రయల్స్ లో వెల్లడైంది" అని ఆస్ట్రాజెనికా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, తాము కేవలం 2 వేల మందినే పరిశీలించామని, వీరిలో ఎవరిలోనూ దుష్ప్రభావాలు కనిపించలేదని, ఎవరూ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని తెలిపారు.