Vande Bharat: దయచేసి వినండి ట్రైన్ నెంబర్ 22439 ఢిల్లీ నుంచి కత్రా వెళ్లవలసిన 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' ప్లాట్‌ఫామ్‌పై వచ్చియున్నది. 'మేడ్ ఇన్ ఇండియా' రైలును ప్రారంభించినందుకు గర్వంగా ఉందన్న అమిత్ షా

గతంలో ఈ ఆలయానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయం ఈ ట్రైన్ ద్వారా ఇప్పుడు 8 గంటలకు తగ్గించబడింది....

Vande Bharat Express on Delhi-Katra Route (Photo Credits: IANS)

New Delhi, October 03: న్యూఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా (Delhi to Katra) వెళ్లే 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'  (Vande Bharat Express) రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు రైల్వే మంత్రి పియూష్ గోయల్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జితేంద్ర సింగ్, డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ తొలి ప్రయాణంలో భాగంగా ఈ ట్రైన్ ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి కత్రాకు బయలుదేరింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభిస్తూ అమిత్ షా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలో తయారైన ట్రైన్ ను ప్రారంభించడం పట్ల గర్వంగా ఉందన్నారు. రైళ్ల వేగం, ప్రమాణాలు మరియు ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా రైల్వే శాఖ అద్భుతమైన కృషి చేస్తుందని షా పేర్కొన్నారు.

వందే ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవడం  ద్వారా జమ్ముకాశ్మీర్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి చేరుకోవడం సులభతరం అయింది. గతంలో ఈ ఆలయానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయం ఈ ట్రైన్ ద్వారా ఇప్పుడు 8 గంటలకు తగ్గించబడింది. అంటే కేవలం 8 గంటల్లోనే ఢిల్లీ నుంచి కత్రా చేరుకోవచ్చు, గతంలో 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రైలు అంబాలా కాంట్, లుధియానా మరియు జమ్మూ తవి అనే మూడు స్టేషన్లలో రెండు నిమిషాలు ఆగుతుంది అని తెలుస్తుంది. మంగళవారం మినహా వారంలో మిగతా అన్ని రోజులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కత్రా చేరుకుంటుంది, అలాగే అదే రోజు తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 3 గంటలకు కత్రా నుండి ప్రారంభమై రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీ నుంచి వెళ్లేటపుడు ట్రైన్ నెంబర్ 22439, వచ్చేటపుడు కత్రా నుంచి ట్రైన్ నెంబర్ 22440 అని ప్రయాణికులు గమనించాలి.  మీ బెర్త్ కన్ఫర్మ్! ఇక వెయిటింగ్ లిస్టులు, వెయిట్ చెయ్యడాలు ఉండవు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తి ఎయిర్ కండిషన్డ్ రైలు, మొత్తం 16 బోగీలు ఉండే ఈ రైలులో చైర్ కార్ సౌకర్యం కలది. ఎంతో విలాసవంతమైన ఈ రైలులో సిసిటివి నిఘా, బయో వాక్యూమ్ టాయిలెట్, జిపిఎస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వైఫై వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలును పూర్తిగా దేశీయంగా నిర్మించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో 18 నెలల వ్యవధిలో రూపొందించింది.