Car on Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై కారుతో ఆటలు, 140 మంది ప్రాణాలు పోయినా కూడా వీళ్లు మారడం లేదు, కర్ణాటకలో ఆకతాయిల తుంటరి పని, స్థానికుల ఆగ్రహంతో వెనక్కు తగ్గిన యువకులు, వీడియో ఇదుగోండి!
ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై (Car on Cable Bridge) కొంతదూరం తీసుకొచ్చారు.
Shivapura, NOV 02: గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన (Gujarat Cable bridge) యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మోర్బీలో తీగల వంతెన కూలడంతో 130 మందికి పైగా మరణించడం అందరినీ కలచివేసింది. మోర్బీలోని (Morbi) పురాతనమైన కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాగా, ఈ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. ఈ దుర్ఘటన నుంచి పాఠం నేర్చుకుని కేబుల్ బ్రిడ్జిల దగ్గర అప్రమత్తంగా ఉండాల్సింది పోయి కొందరు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కర్ణాటకలో ఘోరం జరిగింది. ఓ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు టూరిస్టులు ఏకంగా కారుని ఎక్కించి నడిపే ప్రయత్నం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై (Shivapura hanging bridge) ఈ ఘటన చోటుచేసుకుంది.
మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి ఏకంగా కారును తీసుకొచ్చారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై (Car on Cable Bridge) కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో టూరిస్టులు తగ్గారు. కారును వెనక్కి తీసుకెళ్లారు. కారుని వెనక్కి తీసుకెళ్లడంతో స్థానికులు కూడా సాయం చేశారు. ఆ విధంగా ప్రమాదం నుంచి తప్పించారు. కాగా, ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, నడక కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం దుమారం రేపింది.
తీగల వంతెనపై కారుని వెనక్కి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యాయి. కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరసలు మనుషులేనా? మీరు మారరా? గుణపాఠాలు నేర్వరా? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? అని ఆ టూరిస్టులపై నిప్పులు చెరుగుతున్నారు.