Zika Virus: ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న జికా వైరస్, కొత్తగా మరో 25 జికా కేసులు నమోదు

బుధవారం కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరింది.

Zika Virus (Photo Credits: Flicr)

Kanpur November 04: ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. బుధవారం కొత్తగా మరో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరింది.

ముఖ్యంగా కాన్పూర్‌లో జికా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన 36 జికా వైరస్ కేసుల్లో ఇద్దరు గర్బిణీలు ఉన్నట్లు కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెపాల్ సింగ్ తెలిపారు. దీంతో జికా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 400 నుంచి 500 ఇళ్లలో ఉన్నవారి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

ప్రతి ఇంటి నుంచి శాంపిల్ తీసుకుంటామని అధికారుతు చెప్తున్నారు. జికా వైరస్‌ కేసులు పెరుగుతన్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్పుర్‌లోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్‌పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో  కొత్త జికా వైరస్‌ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

కాన్పూర్ జిల్లాలో జికా కేసులు నమోదైన ప్రాంతాల్లో మొత్తం 150 బృందాలతో ఫాగింగ్ చేస్తున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింప్ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జికా పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రావాలని కాన్పూర్ ప్రజలకు తెలిపారు వైద్యాధికారులు.

దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రెండు నెలల కన్నా తక్కువ వయస్సున్న పిల్లలకు దోమలు కుట్టకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.