Nipah Virus: కేర‌ళలో మ‌రోసారి నిఫా వైర‌స్ క‌ల‌క‌లం, 14 ఏళ్ల బాలుడికి ప్రాణాంత‌క వైర‌స్ నిర్ధార‌ణ‌, ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే?

మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) సదరు బాలుడికి నిపా వైరస్‌ (Nipah Virus) సోకినట్లుగా నిర్ధారించిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు.

Nipah Virus in Kerala (Photo-IANS)

Malappuram, July 20: నిపా వైరస్‌ (Nipah Virus) మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) సదరు బాలుడికి నిపా వైరస్‌ (Nipah Virus) సోకినట్లుగా నిర్ధారించిందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. ప్రస్తుతం బాలుడు ప్రైవేటు ఆసుప్రతిలో వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. బాలుడిని త్వరలోనే కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలుడి కాంటాక్టులను ట్రేస్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హై రిస్క్‌ కాంటాక్టులను విభజించి.. నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

మరోసారి నిపా కేసులు వెలుగు చూడడంతో ప్రోటోకాల్‌ అమలులోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి మలప్పురం, కోజిక్కోడ్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది, జనం మాస్క్‌లు ధరించేలా చూడాలని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో కేరళలో నిపా వైరస్‌ కేసులు (Nipah Virus Cases) నమోదయ్యాయి. కేరళలోని కోజికోడ్‌లో ప్రభావం ఎక్కువగా కనిపిచింది. కేరళలో వైరస్‌ విస్తరించే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేశారు. గత అక్టోబర్‌లో ఐసీఎంఆర్‌ ఉత్తర కోజికోడ్‌ జిల్లాలోని మారుతోంకరా నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిపా వైరస్‌ యాంటీబాడీస్‌ ఉన్నట్లు నిర్ధారించింది.

 

నిపా వైరస్‌ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. వైరస్‌ సోకిన వారిలో మొదట్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. నిపా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులు, మెదడుపై దాడి చేస్తుంది. లక్షణాల్లో దగ్గు, గొంతునొప్పి నుంచి వేగంగా శ్వాస తీసుకోవడం, జ్వరం, వికారం, వాంతులు, జీర్ణాశయాంతర సమస్యలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ మెదడువాపునకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లడంతో పాటు మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.