POK Controlled By Terrorists: ఉగ్రవాదుల నియంత్రణలో పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఆర్టికల్ 370 కూడా తాత్కాలికమే, ఆపిల్ వ్యాపారులపై కాల్పులు జరిపింది ఉగ్రవాదులే, కాశ్మీర్‌లో శాంతి జెండాను ఎగరవేస్తాం, భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
New delhi, October 26: ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్గిత్–బల్టిస్తాన్, పీఓకేలు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. ఆర్మీ కమాండర్లతో నిర్వహించిన సమావేశంలో బిపిన్ రావత్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 తాత్కాలిక ప్రొవిజన్ మాత్రమేనని తెలిపారు. పీఓకే , గిల్గిట్ బాల్టిస్థాన్, మొత్తం కలపి జమ్మూకశ్మీర్ రాష్ట్రం అని అన్నారు. జమ్మూ కశ్మీర్ లో అల్లర్లు సృష్టించేందుకు పాక్ విశ్వప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలు పాకిస్థాన్ ఆక్రమించిందని, అయితే పీఓకేని ఉగ్రవాదుల స్థావరాలుగా మలుచుకున్నారని రావత్ తెలిపారు.
జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 ఉన్నప్పుడు పాక్ అభ్యంతరాలు తెలపలేదని, ఆర్టికల్ 370 తొలిగించినప్పుడే అభ్యంతరాలు తెలుపుతోందని మండిపడ్డారు.
ఆర్మీ కమాండర్లతో సమావేశంలో ఆర్మీ చీఫ్
ఇటీవల ఆపిల్ వ్యాపారులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు. ఇది ముమ్మాటికి పాక్ ఉగ్రవాదుల పనేనని, కశ్మీర్‌లో దుకాణాలు తెరవనివ్వకుండా భయపెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులను సైతం భయపెడుతున్నారన్నారు. శాంతియుత పరిస్థితులను కల్లోలంగా మార్చడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కశ్మీర్‌లో శాంతిని, అభివృద్ధిని సాధిస్తుందని తెలిపారు.
కాల్పులు పాక్ ఉగ్రవాదుల పనే
జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీశ్ చందర్ ముర్ము
కాగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చందర్ ముర్ము జమ్మూకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముర్ము మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం అడిషనల్ ప్రిన్స్‌పల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. నవంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఈ నెల 31న శ్రీనగర్లో ముర్ము ప్రమాణ స్వీకారంచేస్తారు. కశ్మీర్, జమ్మూ ప్రాంతాల పరిపాలనాధికారిగా ఆయన వ్యవహరిస్తారు.
లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆర్‌కే మాథుర్
లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే మాథుర్ నియమితులయ్యారు. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మాధుర్ గత సంవత్సరం ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్ అయ్యారు.లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆయన అక్టోబర్ 31న లేహ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్ గోవా గవర్నర్‌గా వెళ్తున్నారు. తన మిగతా పదవీకాలాన్ని ఆయన గోవాలో పూర్తి చేస్తారు. ముర్ము లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారులుగా వ్యవహరిస్తున్న కే విజయకుమార్, ఖుర్షీద్ గనాయి, కే సికందన్, కేకే శర్మల పదవీకాలం కూడా ముగుస్తుంది. మరోవైపు, మాజీ ఐబీ చీఫ్ దినేశ్వర్ శర్మను లక్షద్వీప్ పరిపాలనాధికారిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైను నియమించారు.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పరిపాలన కొనసాగిస్తుంది.