PMC Depositor Dies: నిండా ముంచిన పీఎంసీ బ్యాంకు, తట్టుకోలేక గుండెపోటుతో ఖాతాదారుడు మృతి, బ్యాంకు స్కాంలో దిమ్మతిరిగే రహస్యాలు ఎన్నో.., త్వరలోనే సంక్షోభాన్ని పరిష్కరిస్తామంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి

ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

pmc-bank-depositor-sanjay-gulati-dies-during-protest-rally-by-depositors-outside-esplanade-court-in-mumbai (Photo-Twitter)

Mumbai, October 15: పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీనికి కారణం వారి అకౌంట్లలో లక్షల్లో మనీ ఉంటే వేల రూపాయలు డ్రా చేసుకోమని చెప్పడమే.. దీంతో ఖాతాదారులు తమ డబ్బులు తీసుకునేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ డిపాజిట్ దారుడు మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు ఎదుట పీఎంసీ ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న అతను గుండెపోటుతో మృతి చెందాడు.

మృతుడిని 51 ఏళ్ల సంజయ్ గులాటీ(Sanjay Gulati)గా పోలీసులు గుర్తించారు. సంజయ్ నిన్న కోర్టు ఎదుట పీఎంసీ ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నాడు. అతని ఖాతాలో రూ. 90 లక్షల ఉన్నట్లు సమాచారం.

గుండెపోటుతో కుప్పకూలిన ఖాతాదారుడు

ఈ సందర్భంగా సంజయ్ గులాటీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సంజయ్‌కు వ్యాపారనిమిత్తం డబ్బుల అవసరం ఉందన్నారు. బ్యాంకులో డబ్బులు ఇవ్వక పోవడంతో చాలాకాలంగా ఆందోళనతో కాలం గడుపుతున్నారని తెలిపారు. పర్యవసానంగానే సంజయ్‌కు గుండెపోటు వచ్చిందని అన్నారు. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా భారతీయ రిజర్వ్ బ్యాంకు... పీఎంసీ ఖాతాదారులకు ఉపశమనం కలిగించింది. పీఎంసీ బ్యాంకు నుంచి ఖాతాదారులు తీసుకునే మొత్తాన్ని 25 వేల నుంచి 40 వేలకు పెంచింది.

డిపాజిటర్ల ఆందోళన

Repulicworld.com కథనం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న సంజయ్ గులాటీ ఈ మధ్యనే జెట్ ఎయిర్ వేస్ (Jet Airways) లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. సోమవారం పీఎంసీ ఖాతాదారులు (PMC Bank Depositors)చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లగానే భోజనం చేశాడని వెంటనే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుస్తోంది. ఓ వైపు ఉద్యోగం పోవడం మరోవైపు బ్యాంకు నిలువునా ముంచడంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యాడు. ఆ భాధను తట్టుకోలేక గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. దాదాపు రూ. 90 లక్షల వరకు బ్యాంకు నుంచి ఆయనకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. వీలైనంత తొందరలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.బ్యాంకుల్లో గరిష్టంగా రూ.లక్ష డిపాజిట్‌ వరకే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ ద్వారా బీమా ఉండగా, ఈ పరిమితి పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీన్ని పార్లమెంటు ద్వారా చేపడతామని చెప్పారు.

కేంద్ర ఆర్థిక మంత్రి సమీక్ష

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌తో తాను మాట్లాడానని, పీఎంసీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారని ట్విట్టర్ ద్వారా మంత్రి తెలియజేశారు.పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో బహుళ రాష్ట్ర సహకార బ్యాంకుల కార్యకలాపాల పరిశీలనకు ఆర్థిక సేవలు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శులు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ త్వరలోనే సమావేశం అవుతారని మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. ఏవైనా చట్ట సవరణలు ఉంటే సూచిస్తారని చెప్పారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో వీటిని పరిగణనలోకి తీసుకుంటామనితెలిపారు.

రికార్డు స్థాయికి పెరిగిన మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ), హెచ్‌డీఐఎల్‌తో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ పీఎంసీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో డిపాజిట్ల ఉపసంహరణలపై రూ.25 వేల పరిమితి పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఖాతాదారులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు.

ప్రధానిగారికి విన్నపం చేస్తున్న బాధితులు

హెచ్‌డీఐఎల్ కంపెనీకి అనుబంధంగా 18 కంపెనీలు ఉన్నాయి. కాగా పీఎంసీ బ్యాంక్ నుంచి నిర్మాణ రంగ సంస్థ హెచ్‌డీఐఎల్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు మొత్తం 44 రుణాలు తీసుకున్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ.11,617.34 కోట్లు కాగా, రుణాల కింద ఇచ్చిన మొత్తం రూ.8,880 కోట్లు. పైగా ఈ మొత్తంలో మూడో వంతు అంటే.. దాదాపు రూ.6,500 కోట్లు ఒక్క హెచ్‌డీఐఎల్ గ్రూప్ కంపెనీలకే ఇచ్చింది. బ్యాంక్ మొత్తం రుణాల్లో (రూ.8,880 కోట్లు) ఇది దాదాపు 73 శాతానికి సమానం. అయితే హెచ్‌డీఐఎల్ రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నా.. పీఎంసీ బ్యాంక్ పెద్దలు కొత్త రుణాలను ఇస్తూ పోయారని, దీనివల్ల బ్యాంక్‌కు గడిచిన 11 ఏండ్లలో రూ.4,355 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా తెలుస్తున్నది.

హెచ్‌డీఐఎల్ కంపెనీ అధినేతలు

వేల కోట్ల రూపాయలను రుణాల కింద తీసుకున్న ఈ గ్రూప్ కంపెనీలు గత రెండేళ్లుగా పీఎంసీ బ్యాంకుకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీంతో హెచ్‌డీఐఎల్ కంపెనీని ఎన్‌పీఏ కింద చేరిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిసిపోతుందని, ఆ తరువాత బ్యాంకుకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. బ్యాలెన్స్ షీట్‌లో హెచ్‌డీఐఎల్ రుణాలను స్టాడర్డ్ కిందనే చూపిస్తూ వచ్చారు. బ్యాంకులోని 44 హెచ్‌డీఐఎల్ రుణ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని కొద్దికొద్దిగా విభజిస్తూ.. 21,049 నకిలీ అకౌంట్లలోకి మార్చారు. పైగా హెచ్‌డీఐఎల్ వీటిని వాడుకోవడానికి వీలుగా ఆయా ఖాతాలకు పాస్‌వర్డ్ భద్రతను కూడా కల్పించారు.

పీఎంసీ బ్యాంకు సృష్టించిన నకిలీ ఖాతాలు ఆర్బీఐకి సమర్పించిన రుణ ఖాతాల వివరాల్లోనూ ఉన్నాయి. అయితే కోర్ బ్యాంకింగ్ సిస్టంలో మాత్రం ఇవి కనిపించకుండా చేశారు. దీనికోసం బ్యాంకు సాఫ్ట్‌వేర్‌ను కూడా ట్యాంపర్ చేశారు. ఈ విషయంలో బ్యాంకు మాజీ ఛైర్మన్ వర్యాం సింగ్, మాజీ ఎండీ జాయ్ థామస్‌ల ప్రమేయం ఉంది. బ్యాంకు లావాదేవీల్లో ఉండే స్క్ఱూటినీ, ఇంటర్నల్ చెకింగ్ సహా అయిదు లేయర్లనూ వీరు తప్పించారు.

బెయిల్ ఇవ్వకండి అంటున్న పీఎంసీ ఖాతాదారులు

అయితే ఈ అక్రమ లోన్ ఖాతాల వ్యవహారం ఆ బ్యాంకులోని క్రెడిట్ విభాగంలో పనిచేసే ఉద్యోగినుల వల్లే బయటికి పొక్కింది. తమ బ్యాంకులో కొన్ని వేల నకిలీ ఖాతాలు తమ దృష్టికి వచ్చాయంటూ వారు ఆర్బీఐకి ఫిర్యాదు చేయడంతో పీఎంసీ బాగోతం బయటికి వచ్చింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగడం, పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల నగదు ఉపసంహరణపై కోత విధించడం, మరోవైపు బ్యాంక్ మాజీ ఎండీ జాయ్ థామస్‌ను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగాయి.

మాజీ మేనేజ్‌మెంట్, హెచ్‌డీఐఎల్ డైరెక్టర్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయగా, ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా నియమించింది. ఇప్పటికే బ్యాంక్ చైర్మన్, ఎండీలతోపాటు హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 409 (ద్రోహం), 420 (చీటింగ్), 465, 466, 471 (ఫోర్జరీ) 120-బీ (నేరపూరిత కుట్ర)ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. నకిలీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని బ్యాంకు వర్గాలు తెలిపాయి.