AIADMK Exits BJP-led NDA Alliance: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్, ప్రధాని మోదీ ఎన్టీఏ కూటమికి గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే, స్వంతంగా బరిలోకి దిగుతామని ప్రకటన

ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో (NDA) సంబంధాలను తెంచుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో​ స్పష్టం చేసింది.

IADMK Chief Edappadi K. Palaniswami (Photo Credit: Wikimedia Commons)

Chennai, Sep 25: తమిళనాడు రాజకీయాల్లో మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో (NDA) సంబంధాలను తెంచుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో​ స్పష్టం చేసింది.

జాతీయ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర బాస్ కె అన్నామలై చేసిన వరుస వ్యాఖ్యల మధ్య ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బిజెపి నాయకుడు ఉద్దేశపూర్వకంగా తమ ప్రస్తుత గత నాయకుల పరువు తీశారని అన్నాడిఎంకె ఆరోపించింది.ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

చెన్నైలో జరిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పెద్దల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి విడిపోతున్నట్లు ప్రకటించారు. బీజేపీ, ఎన్డీయేలతో ఏఐఏడీఎంకే నేటి నుంచి అన్ని బంధాలను తెంచుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది కాలంగా మా మాజీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి పోరాడుతుందని మునుసామి అన్నారు.

తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ప్రధాని మోదీ ఎన్టీఏ కూటమికి గుడ్ బై చెప్పిన ఏఐఏడీఎంకే, స్వంతంగా బరిలోకి దిగుతామని వెల్లడి

అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్‌ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు.

ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్‌ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు.