CM Jagan Master Plan: ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుగా ఏపీ అడుగులు, ఆరు సూత్రాల ఫార్ములాతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం, అధికారులతో సచివాలయంలో ఉన్నత సమీక్ష

ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

AP-cm-jagan-review-meeting-on-health-department (Photo-Twitter)

Amaravathi,October 19:  పరిపాలనలో తనదైన ముద్రతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు. ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. వైద్య , ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాలను పాటిస్తూ ఔషధాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అంతే కాకుండా కొత్తగా 108, 104 వాహనాలు సహా బైక్‌ అంబులెన్స్‌లు కొనుగోళ్ల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు.ఈమేరకు మార్గదర్శకాలతో కూడిన ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేయాలన్నారు.

నవంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమౌతున్న వారికి ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు నెలకు 16 వేల రూపాయల జీతం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 21న ఆరోగ్యకార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం డిసైడైంది. నెలకు ఐదు వేలు లేదా రోజుకు 225 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10వేల వర్తింపు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్య శ్రీ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు చేయాలనీ, డెంగూ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు