Babul Supriyo Joins TMC: దీదీ ఇలాకాలో బీజేపీకి మళ్లీ షాక్, టీఎంసీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, మరికొంత మంది నేతలు క్యూలో ఉన్నారని తెలిపిన టీఎంసీ నేత కునాల్ ఘోష్
కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (Babul Supriyo Joins TMC) నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ (Abhishek Banerjee and Derek O'Brien) సాదర స్వాగతం పలికారు.
kolkata, Sep 17: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో (Babul Supriyo Joins TMC) నేడు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ (Abhishek Banerjee and Derek O'Brien) సాదర స్వాగతం పలికారు. బాబుల్ సుప్రియో ఇటీవలే కేంద్ర క్యాబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవిని కోల్పోయారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆయనను బలవంతంగా తప్పించారు. దాంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
తాను ఏ పార్టీలో చేరబోనని, రాజకీయాల నుంచి వైదొలగుతానని అప్పట్లో ప్రకటించిన బాబుల్ సుప్రియో... తాజాగా మనసు మార్చుకున్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు బెంగాల్ అధికార పక్షం టీఎంసీ పంచన చేరారు.ఇటీవల మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ బెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నుంచి వలస వచ్చినవారిలో బాబుల్ సుప్రియో ఐదో వాడు.
Here's TMC Tweet
ఇటీవల నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఎంసీ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ, బీజేపీ నుంచి మరింతమంది నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం వారు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. బహుశా వారు రేపు టీఎంసీలో చేరతారని భావిస్తున్నామని ఘోష్ పేర్కొన్నారు. వారు బీజేపీతో సంతృప్తికరంగా లేరని వివరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు.