Charanjit Singh Channi: పంజాబ్‌కు తొలిసారిగా దళిత ముఖ్యమంత్రి, కొత్త సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ శాసన సభా పక్షం
ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని (Charanjit Singh Channi) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్‌లో వెల్లడించారు.
Chandigarh, September 19: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీకి అవకాశం దక్కింది. ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం సీఎంగా చన్నీని (Charanjit Singh Channi) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్‌లో వెల్లడించారు. చన్నీకి సీఎం (Punjab Chief Minister) బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే.
మరోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా ఆయన ఆమోదించారు. చరణ్ జీత్ సింగ్ చన్నీ దళిత వర్గానికి చెందిన నేత. తొలుత సుఖ్‌జీందర్ సింగ్ రాంద్వాను పంజాబ్ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్‌కు నవజ్యోత్‌సింగ్ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ.. ఆ ప్రక్రియ పూర్తైతే పంజాబ్ తొట్టతొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కుతారు. ఇప్పటి వరకు పంజాబ్‌కు 15 మంది ముఖ్యమంత్రులు పని చేశారు. పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చన్నీ రాష్ట్రానికి మొదటి దళిత సీఎం కాబోతుండడం గమనార్హం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఛంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజకీయంగా చన్నీపై ఎలాంటి మరకలు లేకపోవడంతో అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక పోతే రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన శిరోమణి అకాలీ దళ్, బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఒక కారణం. సిక్కు వర్గంలో దళితుల ఓటు శాతం ఎక్కువ. శిరోమణి అకాలీ దళ్ పార్టీకి ఇది కలిసి వస్తుందనే ఊహాగానాలు అనేకం ఉన్నాయి. తాజా ఎంపికలో ఇది కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.