KCR on TSRTC: ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు, హైకోర్టుకూ అధికారం లేదు, కార్మిక సంఘాలది దురహంకార ధోరణి, బాధ్యత గల ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నాం

కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించాలని చెప్పే అధికారం హైకోర్టుకు కూడా లేదు...

CM KCR Press Meet On TSRTC Strike | (Photo-PTI)

Hyderabad, October 24:  హుజూర్ నగర్ ఉపఎన్నిక (Huzur Nagar Bypoll) లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ (CM KCR), ముందుగా అఖండ మెజారిటీ అందించిన హుజూర్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం అందరూ ఊహించిన విధంగానే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎవరికీ ఉపయోగం లేని పనికిమాలిన సమ్మెగా అభివర్ణించిన కేసీఆర్, కేవలం యూనియన్ ఎలక్షన్ల కోసం, ప్రతిపక్షాల రాజకీయాల కోసమే ఆ సమ్మె జరుగుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూనియన్ లీడర్ల ప్రలోభాలతో మధ్యలో అమాయకులైన కార్మికులు నష్టపోయారని పేర్కొన్నారు. ఆర్టీసీని విలీనం అనేదే ఒక అవివేకమైన చర్య, అలాంటి ఉద్దేశ్యాలేమి ప్రభుత్వానికి లేవని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఆర్టీసీ ఇకపైన ఉండదని, సమూలంగా మారబోతున్నట్లు సీఎం తేల్చిచెప్పారు.

ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన సీఎం, మరో వారం రోజుల్లో ప్రజలకు రవాణా ఇబ్బందులు పూర్తిగా తొలగించటానికి అదనంగా  7వేల అద్దె బస్సులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ఇకపై బస్సు ఛార్జీలు గతంలో కంటే కూడా తక్కువ ఉండేటట్లు  చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.

సీఎం కేసీఆర్ మాటల్లో....

ఆర్థిక మందగమనం కారణంగా ఈసారి తెలంగాణ బడ్జెట్ లో పెట్టింది 1,36 లక్షల కోట్లే.  ఆర్థిక మందగమనం దేశాన్ని వేధిస్తున్న అతి తీవ్రమైన సమస్య. వేలాది ఉద్యోగాలు పోతున్నాయి, కాగ్ లెక్కలో తెలంగాణ 3.2 గ్రోత్ పడిపోయింది. అత్యంత జాగరూపకతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు.

గతంలో నేను రవాణమంత్రిని, ఆర్టీసీ సంస్థ గురించి నాకే బాగా తెలుసు, నాకు ఆ సంస్థపై అభిమానం. 1997లో తీవ్రంగా శ్రమించి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చాను. నేను సీఎం అయిన తర్వాత 44 శాతం సాలరీలు పెంచాను, నష్టాల్లో ఉన్నప్పటికీ 14శాతం ఐఆర్ పెంచాను. భారతదేశ చరిత్రలో 4 ఏళ్లలో 67% కార్మికుల వేతనాలను పెంచిన చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు. ఇంత పెంచినా, గొంతెమ్మ కోర్కెలు కోరడంలో అర్థం లేదు.

తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా 57 కార్పోరేషన్లు ఉన్నాయి, వాటన్నంటినీ విలీనం చేయమని అడిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? విలీనం అనేది పనికి మాలిన మాట, ఎవరో వచ్చి విలీనం చేయమని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే చేయాలా? అన్ని రాష్ట్రాలు ఆర్టీసీని తీసేశాయి, దేశంలోని 4 నుంచి 5 రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీనే లేదు, వెస్ట్ బెంగాల్ లో 10 కోట్ల జనాభా, అక్కడ ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల సంఖ్య 200 మాత్రమే. అక్కడ ఆర్టీసీని మూసిసేంది ఈరోజు మాపై విమర్శలు చేస్తున్న సీపీఎం పార్టీనే, మధ్యప్రదేశ్ లో ఆర్టీసీని మూసేసింది కాంగ్రెస్ పార్టీనే.

ఆర్టీసీ లో యూనియన్ లీడర్ల బాధ్యతారాహిత్యమైన చర్యల వల్లే నష్టాలు, వారి సమ్మెకు అర్థం లేదు, తిన్నది అరగక చేస్తున్న సమ్మె అది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కష్టపడి పనిచేసే వారే కానీ, వారి లీడర్లతోనే నష్టపోతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సమ్మె జరుగుతుంది. యూనియన్ ఎలక్షన్స్ కోసమే యూనియన్ లీడర్లు కార్మికులను ప్రలోభ పెట్టి చేసే చిల్లర వ్యవహారమే ఈ ఆర్టీసీ సమ్మె.

గతంలో ఉన్న విధంగా ఇకపై ఆర్టీసీ ఖచ్చితంగా ఉండదు. ఆర్టీసీ సంస్థనే లేనప్పుడు, సమ్మె చేసి ఏం లాభం? ఆర్టీసీ సంస్థ నేడు రూ. 5000 కోట్లు బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. కార్మికుల పీఎఫ్ సొమ్మును తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు.

ప్రైవేట్ ట్రావెల్స్ లాభాల్లో ఎందుకు ఉంటున్నాయి? ఆర్టీసీ నష్టాల్లో ఎందుకు ఉంటుంది? ఆర్టీసీ నష్టం రోజుకు రూ. 100 కోట్లు, నెలకు రూ. 1200 కోట్లు.

అద్దె బస్సుల మీద రోజుకు రూ. 4.5 కోట్ల లాభం వస్తుంది, ఆర్టీసీ బస్సులకు మాత్రం రోజుకు రూ. 3 కోట్ల నష్టం వస్తుంది. అలాంటపుడు అద్దె బస్సులు తీసేయాలనే వీరి డిమాండ్ లో అర్థముందా?

నేడు ఆర్టీసీ కార్మికుడికి 50 వేల జీతం ఉంది. బయట జనాలకు నెలకు రూ. 5 వేలు దొరకని వాడు, తినడానికి అన్నం లేనివాడు ఉన్నాడు.

నీ సంస్థను కాపాడుకోవా? నీవృత్తి ధర్మం కాదా అది? సొంత ఆస్తినే నష్టపరుచుకుంటారా? పండగ సీజన్ లో ఆర్టీసీకి

లాభం వస్తుంది. తెలంగాణలో అంత ముఖ్యమైన పండగ వస్తే సమ్మె చేసి ప్రజలను ఇబ్బంది పెడతారా? మంచి లాభాలను కోల్పోతారా?

కార్మిక సంఘాలు గొంతెమ్మ కోర్కెలు కోరినా, డిమాండ్లను పరిశీలించాలని కమిటీ వేశాం, సంజాయించే ప్రయత్నం చేశాం, సమయం పడుతుంది, ఆలోచిద్దాం అని చెప్పినపుడు విలీనం చేస్తున్నట్లు రాసిస్తారా? లేదా అంటూ సమ్మెకు పోయారు. అప్పుడు ఏదో ప్రయత్నిద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఆర్టీసీ మునిగిపోయింది. ఎవ్వరూ దానికి కాపాడలేరు.

హైకోర్టులో కేసు ఏస్తే ఏమవుతుంది? హైకోర్ట్ కొడుతుందా మమ్మల్ని? ఆర్టీసీ దగ్గర డబ్బు లేనప్పుడు ఏ కోర్ట్ ఏం చేస్తుంది?

ముఖ్యమంత్రిగా చెప్తున్నా, హైకోర్టుకు కూడా దీనిపై అధికారం లేదు. కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించాలని చెప్పే అధికారం హైకోర్టుకు కూడా లేదు, చీఫ్ జస్టిస్ కూడా మానవతాకోణంలో సమస్యను పరిశీలించగలరేమో చూడమనే మాకు చెప్పారు. యూనియన్ లీడర్ల రాజకీయాలతో అమాయమైన కార్మికులు బలవుతున్నారు. ఇప్పుడు వారికి జీతాలివ్వాలన్నా నాలుగు బస్సులు అమ్మే ఇవ్వాలి. ఇంకొన్ని రోజుల్లో భారీగా బస్సులకు పరిమితి ఇస్తున్నాం, ప్రజల అవసరానికి మించి బస్సులు ఉంటాయి. 10 రోజుల్లోపు 7వేల బస్సులను అద్దెకు తీసుకుంటున్నాం.

ఈరోజు ఆర్టీసీ సమ్మెకు ముగింపు అంటే ఆర్టీసీ ముగింపే.

ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలు:

ఏపీఎస్ ఆర్టీసీ విలీనం గురించి జర్నలిస్టులు ప్రశ్నించినపుడు. ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ కూడా ఆర్టీసీని విలీనంపై పరిశీలించడానికి కమిటీ మాత్రమే వేశారు. అక్కడ కూడా విలీనం జరుగుతుందని గ్యారెంటీ లేదు. అని కేసీఆర్ అన్నారు.