MLC Polls 2021 Counting: తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్, ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు, రెండో ప్రాధాన్యత ఓట్లు తమకేనని ప్రత్యర్థుల ధీమా!

ఈ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....

MLC Polls 2021- Counting | Photo: Twitter

Hyderabad, March 19: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం అనివార్యం అయింది. రెండు స్థానాలకు గానూ బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన కౌంటింగ్ శుక్రవారం కూడా కొనసాగుతుంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు.

శుక్రవారం ఉదయం నాటికి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానానికి మొత్తం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840 ఓట్లు రాగా, మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ప్రొ. కోదండ రామ్‌కు 70,072 ఓట్లు వచ్చాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఇక్కడ ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తుది ఫలితం శుక్రవారం రాత్రి వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు.

మరోవైపు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సీ స్థానానికి ఇప్పటివరకు 5 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి సురభి వాణి 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సురభి వాణికి 88,304 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావుకు 81,749 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‎కు 42,604 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440, టీడీపీ అభ్యర్థి ఎల్‌. రమణకు 4,656 ఓట్లు పోలయ్యాయి.

ప్రస్తుతం ఇక్కడ ఆరో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఎవరికీ సరైన మెజారిటీ రాకపోతే, మూడో రౌండ్ ఓట్ల లెక్కింపుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శనివారం వరకు కూడా ఈ కౌంటింగ్ ఇలాగే కొనసాగుతుంది.