Election Code in AP: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్, ఆఖిలపక్షంతో భేటీ అనంతరం స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, భేటీకి బీజేపీ, టీడిపీ మరియు జనసేన పార్టీల గైర్హాజరు

శుక్రవారం నాడు అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్నీ, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు....

AP SEC Nilam Sawhney (Photo-Twitter)

Vijayawada, April 2: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ అన్నారు. శుక్రవారం నాడు అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్నీ, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. అభ్యర్థుల జాబితా గతంలోనే పూర్తయిందని,కాబట్టి ఎన్నికలను ఆపడానికి ఎటువంటి కారణం లేదని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు.

విజయవాడలోని ఎస్‌ఇసి కార్యాలయంలో జరిగిన ఈ ఆల్ పార్టీ సమావేశానికి అధికార వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్, సిపిఎం పార్టీల ప్రతినిధులు హాజరవ్వగా, బీజేపీ, టీడిపీ మరియు జనసేన పార్టీల తరఫు నుంచి ఎవరూ హాజరవలేదు . ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీలు ప్రకటించాయి. అంతేకాకుండా రాత్రికి రాత్రే ఎన్నికల తేదీలను ప్రకటించడం మరియు పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సమావేశానికి గైర్హాజరైన పార్టీల నేతలు పేర్కొన్నారు.

పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తికాకముందే ఎన్నికల కమీషన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ అన్నారు. ఎస్ఈసీ నిర్ణయం అధికార పార్టీకి మేలు చేసేలా ఉందని ఆయన అన్నారు.

మరోవైపు ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ ఏపి బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమీషన్ గురువారం సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చింది.  షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 8న పోలింగ్, అవసరమయ్యే చోట ఏప్రిల్ 9వ తేదీన రీపోలింగ్ మరియు ఏప్రిల్ 10న ఫలితాల వెల్లడి.